<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://www.blogger.com/navbar.g?targetBlogID\x3d1254698467234035774\x26blogName\x3d%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82\x26publishMode\x3dPUBLISH_MODE_BLOGSPOT\x26navbarType\x3dTAN\x26layoutType\x3dCLASSIC\x26searchRoot\x3dhttps://jagannaatakam.blogspot.com/search\x26blogLocale\x3den_US\x26v\x3d2\x26homepageUrl\x3dhttp://jagannaatakam.blogspot.com/\x26vt\x3d-5619112905543282348', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

జ్వరం

Sunday, November 25, 2007

ఒకనాడు వెండి కొండ మీద కొలువు దీర్చి కూర్చున్నాడు శివుడు. దేవతలూ, మహర్షులూ సంతోషంగా ఎక్కడికో వెళ్ళటం చూసి "స్వామీ!వీళ్ళంతా ఎక్కడికి వెళుతున్నారు?" అని భర్తను ప్రశ్నించింది భవాని. "దక్షప్రజాపతి చేస్తున్న యజ్ఞంలో తమ తమ హవిర్భాగాలు తీసుకునేందుకు వెళుతున్నార"ని శివుడు చెప్పాడు. "మరి మీరెందుకు వెళ్ళలేదు?" . "అతడు నన్ను పిలవలేదు.నాకు హవిస్సులో భాగం కల్పించలేదు. అందుకని వెళ్ళను" అన్నాడు శివుడు. పారతికి కోపం వచ్చి మౌనం వహించింది. ఈశ్వరుడు ఆమె మనస్సు గ్రహించి దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేయడానికి ప్రమధగణాలతో బయలుదేరాడు.

ప్రమధగణాల ధాటికి ఆగలేక యజ్ఞం మృగరూపం ధరించి పారిపోయింది. ఉగ్రతాండవం చేసిన శివుని నుదుట చెమట పట్టింది. ఆ చెమటబిందువు కింద పడి పెద్ద మంటలు లేచాయి. ఆ మంటల్లోంచి భయంకరాకారుడైన పురుషుడొకడు పుట్టాడు. అతని చూసి భయంతో దేవతలూ, మునులూ తలో దిక్కుకు పారిపోయారు.అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి " దేవా! శాంతించు. దేవతలు నీకు హవిర్భాగం కల్పిస్తారు" అని ప్రార్ధించాడు. అంతట రుద్రుడు శాంతించాడు. యాగం ముగిసింది. అంతట బ్రహ్మదేవుడు" దేవా! నీ నుదుటి చెమట వల్ల పుట్టిన పురుషుడు "జ్వరం" అనే పేరుతో సర్వత్రా సంచరిస్తాడు. కాని అతడు ఒకే రూపంలో ఉంటే నేలతల్లికి భారమవుతాడు. బహువిధాలుగా చేయవా?" అని ప్రార్ధించాడు. అప్పుడు శివుడు "ఈ జ్వరం గురులకు శిరస్థానంగానూ, పాములకు కుబుసంగానూ, గోవులకు అరికాలి గిట్టలలొ బాధగానూ, మృగాలకు తమ స్వరూపాలను చూడలేక పోవడంగానూ, గుర్రాలకు పార్స్వశోషణంగానూ, నెమళ్ళకు ఈకలు రాలిపోవడంగానూ, కోకిలలకు నేత్రవ్యాధిగానూ, మనుష్యులకు చావుపుట్టుకల్లో కలిగే బాధగానూ అ జ్వరాన్ని విభజించాడు.

వృత్రాసురుడికి, ఇంద్రుడికి యుద్ధం జరిగినప్పుడు పరమేశ్వర తేజం జ్వరరూపం ధరించి వచ్చి వృత్రాసురుణ్ణి చుట్టుకుంది. లేకపోతే ఇంద్రుడు ఓడిపోయేవాడే. ఒకసారి ఇంద్రుడు, వృత్రాసురుడి మధ్య యుద్ధం జరిగింది. వృత్రుని మాయాబల ప్రభావం వల్ల ఇంద్రుడు మూర్చపోయాడు.అప్పుడూ వశిష్టుడు తన తపశ్శక్తితో అతనికి స్పృహకలిగించాడు.ఇంద్రుడికి జయం ఇవ్వవలసిందని పరమేశ్వరుడిని ప్రార్ధించగా ఆ దేవదేవుడు జ్వరరూపం ధరించి వృత్రాసురుణ్ణి చుట్టుముట్టాడు. తరువాత జ్వరం వజ్రాయుధంలో ప్రవేశించేసరికి ఇంద్రుడు దానిని ప్రయోగించి వృత్రాసురుడిని కూల్చాడు. వజ్రంలో ఉన్న విష్ణుస్పర్శ వల్ల వృత్రాసురుడి పాపాలన్నీ పోయి అతనికి అనంతశాంతి లభించింది.


వృత్రాసురుడి ప్రాణం పోగానే ఇంద్రుణ్ణి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఇంద్రుడు వెళ్ళి తామర తూడులో దాక్కున్నా వదలలేదది. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకోగా ఆయన బ్రహ్మహత్యాపాతకాన్ని నాలుగు భాగాలు చేసి అగ్నికీ, ఔషధవృక్షాలకూ, స్త్రీలకూ,నీటికీ సమంగా ఇచ్చాడు. వాళ్ళు భయపడి "స్వామీ! ఈ పాపం నుంచి మాకు నిష్కృతి లేదా?" అని అడిగారు. "నువ్వు ప్రజ్వల్లిరకుండానే నీలో హవిస్సు వ్రేల్చిన వాళ్ళకు నీలో ఉన్న దోషం సంక్రమిస్తుంది" అని అగ్నికి, 'పర్వకాలంలో మిమ్మల్ని చేదించిన వాళ్ళకు మీ పాపం చెందుతుంది" అని ఔషధ వృక్షాలకు, "రజస్వలలై ఉన్న మిమ్మల్ని చేపట్టిన వాళ్ళకు మీ పాపం సంక్రమిస్తుంది" అని స్త్రీలకూ,"మీలో మల మూత్ర శ్లేష్మాలు ఎవరు విడిస్తే వాళ్ళకు మీ పాతకం చుట్టుకుంటుంది" అని నీటికి చెప్పాడు బ్రహ్మ.


ఆ రకంగా కల్మషరహితుడైన ఇంద్రుడు అశ్వమేధయాగం చేసి మళ్ళీ సర్వలోకపూజ్యుడై ప్రకాశించాడు. వృత్రాసురుడి రక్తంలో పుట్టిన బుడగలు పుట్టకొక్కులై మనుష్యులకు ఆహారమయ్యాయి.

Labels:

posted by జ్యోతి, 4:03 PM | link | 3 comments |