ఖాండవ వన దహనం
Monday, February 16, 2009
నివారణోపాయాన్ని తెలుసుకున్న అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించడానికి ఉపక్రమించాడు. కాని ఆ వనంలో ఇంద్రుని స్నేహితుడైన తక్షకుడు తన భార్యా పిల్లల్లతో ఉంటున్నాడు. తన స్నేహితుడిని రక్షించడానికి ఇంద్రుడు పూనుకున్నాడు. అగ్నిదేవుడు వనాన్ని దహించడం మొదలుపెట్టగానే ఇంద్రుడు కుండపోతగా వర్షం కురిపించాడు. వనాన్ని ఎలాగైనా దహించి తన ఆరోగ్య సమస్యను తీర్చుకోవాలన్న కృతనిశ్చయంతో అగ్నిదేవుడు వరుసగా ఏడురోజులు ప్రయత్నించినా విఫలుడయ్యాడు. మళ్లీ బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోగా "నరనారాయణులు భూమిపై కృష్ణార్జునులుగా అవతరించినప్పుడు నీ కోరిక నెరవేరుతుంది. వేచి ఉండుము" అని ఉపాయం చేప్తాడు బ్రహ్మదేవుడు.
కృష్ణార్జునులు ఇంద్రప్రస్తంలో ఉన్నప్పుడు యమునాతీరాన విహారానికి చేస్తుండగా అగ్నిదేవుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వారి వద్దకు వెళ్లి తన వ్యాధి గురించి చెప్పి సహాయం అర్ధించాడు. ఆ తర్వాత తన నిజరూపంలో ఖాండవ వనాన్ని దహనం చేయాలనే కోరికను వెలిబుచ్చాడు. కానీ ఆ సమయంలో కృష్ణార్జునుల వద్ద ఎటువంటి ఆయుధాలు లేవు. అది గమనించి అగ్నిదేవుడు వరుణ దేవుడిని ప్రార్ధించగా, అతను ప్రత్యక్షమై అర్జునుడికి చంద్రధనుస్సు (గాండీవం) , దానితో పాటు అక్షయ తూణీరం ఇచ్చాడు. ఆ తూణీరంలో ఎన్ని బాణాలు తీసివేస్తున్నా అది ఖాళీ కాదు. ఎప్పుడూ శరసమృద్ధమై ఉంటుంది. దానికి తోడూ కపిరాజు చిత్రంతో ఉన్న ధ్వజాన్ని అమర్చి, బలిష్టమైన నాలుగు అశ్వాలు పూన్చి నాలుగింటికీ కళ్ళేలుగా నాలుగు బంగారు గొలుసులు ఉన్న దివ్య రధాన్ని ఇచ్చాడు.
కృష్ణార్జునులు ఖాండవవన సరిహద్దుల్లో నిలబడి కాపలా కాస్తూ వనాన్ని దహించమని అగ్నికి చెప్పారు. అగ్ని జ్వాలలకు తట్టుకోలేక అడవిలో తపస్సు చేసుకుంటున్న మహర్షులు ఎటూ పోలేక రక్షించమని దేవేంద్రుణ్ణి వేడుకున్నారు. అతని ప్రభావంతో ఉరుములు , మెరుపులతో వర్షం మొదలైంది. ఆ వెంటనే అర్జునుడు ఆకాశంలో అమ్ములతో ఛత్రం ఏర్పరిచి వాన జల్లు అడవిలో పడకుండా అడ్డుకున్నాడు. ఆ సమయానికి తక్షకుడు కురుక్షేత్రం వెళ్ళాడు. అతని కొడుకు అశ్వసేనుడు మంటల్లో చిక్కుకుని గిలగిల్లాడసాగాడు. కొడుకును కాపాడడానికి అతని తల్లి అతన్ని మింగి దూరంగా విసిరేయాలనుకుంది. అది గమనించిన అర్జునుడు అశ్వసేనుడు తల నరకబోయాడు. వెంటనే ఇంద్రుడు గాలి దుమ్ము రేపాడు. కళ్ళలోకి ధూళి పోవడంతో అర్జునుడి గురి తప్పింది. అశ్వసేనుడు రక్షింపబడ్డాడు. అశ్వసేనుడు తలదాచుకునేందుకు ఎక్కడా చోటు దొరకరాదని అగ్ని, కృష్ణార్జునులు శపించారు.
బాణాల గొడుగు చాటున అగ్ని ఖాండవవనాన్ని దహిస్తున్నాడు. అతిప్రయాసతో తప్పించుకుని బయటకు వచ్చిన పాములను, డేగలను అర్జునుడు వధించాడు. మరోపక్క కృష్ణుడు అసురులను మట్టికరిపించాడు. దేవతలందరూ ఇంద్రుడికి యుద్ధంలో సహాయపడినా ఇంద్రుడు ఓడిపోయాడు. కృష్ణార్జునులు విజయం సాధించారు. ఖాండవవనాన్ని సమూలంగా దహించిన అగ్నిదేవుడు తిరిగి ఉజ్వలంగా ప్రకాశించాడు.
Labels: ఖ
ఆకలి బాధ
Saturday, September 6, 2008
కొంతకాలానికి మరణించిన శ్వేతుడిని విష్ణుభక్తులు వచ్చి స్వర్గానికి తీసికెళ్ళారు. అక్కడ దేవకన్యలు సేవిస్తుంటే భోగభాగ్యాలు అనుభవిస్తూ సంతోషంగా ఉన్నాడు. కాని అన్ని సుఖాలున్నా శ్వేతుడు ఆకలిబాధతో బాధపడుతున్నాడు. స్వర్గంలో ఉండేవాళ్ళకు అస్సలు ఆకలి అనేది ఉండదు ఆకలివేస్తే తినడానికి కూడా ఏమి ఉండదు. కాని శ్వేతుడికి స్వర్గలోకంలో కూడా ఆకలిబాధ తప్పలేదు.
ఆ బాధ తట్టుకోలేక ఒక రోజు బ్రహ్మ దగ్గరకు వెళ్లాడు. "స్వామి! నేను గొప్ప తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గానికి వచ్చాను. కాని నాకు ఆకలి బాధ తప్పలేదు. స్వర్గంలో ఉన్న మిగతావారికి ఆకలి ఉండదు కాబట్టి ఇక్కడ తినడానికి ఏమీ దొరకడంలేదు. ఈ బాధ తప్పే ఉపాయం చెప్పండి " అని వేడుకున్నాడు.
అతని మాటలు విన్న బ్రహ్మ " మహారాజా! నువ్వు గొప్ప తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గలోకానికి వచ్చావు. కాని ఎవ్వరికీ లేని ఆకలిబాధ నీకు కలిగింది. దానికి కారణం చెప్తాను విను. నువ్వు ఎవరి ఆకలి బాధ తీర్చలేదు. ఎవరికి పట్టెడు అన్నం పెట్టలేదు. దాహమన్న వాళ్ళకి మంచినీళ్ళివ్వలేదు. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. అది నువ్వు చేయలేదు. అందుకే "ఆకలిబాధ" అంటే ఏమితో ఇప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావు" అన్నాడు బ్రహ్మ.
"స్వామి ! మరి నా ఆకలిబాధ తీరే మార్గం లేదా?. నన్ను కాపాడండి." అని వేడుకున్నాడు శ్వేతుడు.
" శ్వేతా! నువ్వు భూలోకంలో నీ శవం ఎక్కడుందో వెతికి, అక్కడికి వెళ్ళి రోజూ కొంచెం కొంచెం తిని నీ ఆకలి బాధ తగ్గించుకో. నువ్వు ఎంత తిన్నా కూడా ఆ భాగం మళ్ళీ పెరుగుతుంది. అది ఎప్పటికి తరగదు" అన్నాడు బ్రహ్మ.
"స్వామీ! అలా నా శవాన్ని నేను ఎంతకాలం తినాలి?" అని అడిగాడు శ్వేతుడు.
"అగస్త్య మహర్షి నీ దగ్గరకు వచ్చి నిన్ను పలకరించేవరకు తింటూనే ఉండు. !" అన్నాడు బ్రహ్మదేవుడు.
బ్రహ్మ చెప్పినవిధంగా శ్వేతుడు రోజూ భూలోకం వెళ్ళి తన శవం ఎక్కడుందో వెతుక్కుని రోజూ తింటు ఆకలి తీరాక తిరిగి వస్తున్నాడు. మర్నాడు వెళ్ళేసరికి ఆ భాగం మళ్ళీ అలాగే ఉంటుంది. ఆ శవం కూడ కుళ్ళిపోకుండా, మనిషి పడుకున్నట్టే ఉంటుంది.
ఒకరోజు శ్వేతుడు ఆ శవాన్ని కోసుకుని తింటుండగా అగస్త్య మహర్షి చూసి ఆశ్చర్యపోయాడు. వెళ్ళి అతడిని పలకరించాడు. అప్పుడు " మహాత్మా! మిమ్మల్ని చూసిన నా జన్మ ధన్యమైనది. నా ఆకలి బాధ తీరింది. ఆకలిబాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవంతో తెలుసుకుని నేను చేసిన తప్పును అర్ధం చేసుకున్నాను" అని నమస్కరించి స్వర్గానికి వెళ్ళి సంతోషంగా ఉన్నాడు శ్వేతుడు.
Labels: ఆ
బూరుగు గర్వభంగం
Thursday, May 1, 2008
బలవంతులతో దుర్భలులెప్పుడూ పోటీపడకూడదు. పెద్ద రాయి కింద చెయ్యి పెట్టకూడదని అనుభవజ్ఞులు చెబుతుంటారు.
హిమవత్ పర్వతం మీద ఒక పెద్ద బూరుగు వృక్షం ఉండేది. ఓసారి నారద మహర్షి ఆ దారిన వెడుతూ మధ్యలో బూరుగు దగ్గర ఒక క్షణం ఆగి " బూరుగా! ఈ హిమవత్ పర్వతం మీద నీ అంత పొడుగూ, వైశాల్యం కలిగిన చెట్టు మరేది లేదు. ఎన్నో పక్షులు నిన్ను ఆశ్రయించి జీవిస్తున్నాయి. గాలికి అన్ని చెట్లూ కూలిపోతాయి కాని నువ్వు మాత్రం చెక్కు చెదరకుండా నిలబడతావు. వాయుదేవుడు నీకు చుట్టమా. అతడు నిన్ను దయ తలచి రక్షిస్తున్నాడా" అని అడిగాడు.
బూరుగు వృక్షం ఆ మాటలకు పొంగిపోయింది.
"మునీంద్రా ! నా ముందు వాయుదేవుడెంత? అతని బలం నా బలంలో పదో వంతు కూడా రాదు" అంది గర్వంగా.
దేవర్షి చిన్నగా నవ్వి, " అంత మాటనకు. వాయుదేవుడు తలుచుకున్నాడంటే కొండలే కూలిపోతాయి. తెలుసా?" అన్నాడు.
"అదేమో నాకు తెలీదు. నా మొదలూ, కొమ్మలు చూసావా ఎంత బలంగా ఉన్నాయో . నన్ను తాకితే అతనికున్న ప్రభంజనుడనే బిరుదు కాస్తా పోతుంది." అంది బూరుగు.
"సరే, నీ ఇష్టం. వస్తా" అంటూ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు నారదుడు. సంగతంతా చిటికలొ వాయుదేవుడికి అందించేసాడు.
వాయుదేవుడు బూరుగు చెట్టు దగ్గరకు వెళ్ళి " ఏమే బూరుగా! ఏం వాగావు. నీకు నాకంటే ఎక్కువ బలం ఉందా.నేను నిన్ను ఏమీ చేయలేనా. మాటలెందుకు. కాచుకో" అన్నాడు కోపంగా.
"తేలిగ్గా మాట్లాడకు. లోకంలో ఉన్న వృక్షాలతో నేను సమానం కాను " అంది శాల్మలి.
"ఓహో! ఎంత గర్వం? ఐతే నువ్వు అన్ని వృక్షాలకంటే గొప్పదానివని విర్రవీగకు. బ్రహ్మదేవుడు నీ నీడలో నిలబడ్డాడన్న గౌరవం కొద్దీ నిన్ను ఏం చెయ్యకుండా ఇన్నాళ్ళూ వదిలేశాను. అందుకే ఇప్పుడిలా పొగరెక్కి మాట్లాడుతున్నావు. ఐతే సరే రేపు బలాబలాలు తేల్చుకుందాం" అని వెళ్ళిపోయాడు.
వాయుదేవుడు వెళ్ళిపోయాక బూరుగు వృక్షానికి భయం పట్టుకుంది. "అయ్యో, మహాబలుడైన వాయుదేవుడితొ ఎరగక విరోధం పెట్టుకున్నాను. రేపు నా గతేమిటి.నారదమహర్షి మాటలు వినకపోయాను కదా" అని విచారించింది.
మరుక్షణం కాస్త ధైర్యం తెచ్చుకుంది." "వాయుదేవుడొస్తే ఏం చేస్తాడు. ఆకులు రాల్చేస్తాడు. కొమ్మలు, రెమ్మలు విరిచేస్తాడు! . ఆ పని నేనే చేసుకుంటే ఇంక అతనేం చేయగలడు. అతను ఓడిపోయినట్టేగా!" అనుకుని బలాన్న్నంతా కూడగట్టుకుని తనకు తానే ఆకులు విదిలించుకుని, కొమ్మలన్నింటిని విరుచుకుని మోడై నిలబడింది.
తెల్లవారింది.
భయంకరంగా ధ్వని చేస్తూ వాయుదేవుడు వచ్చాడు. ఆకులు, కొమ్మలు లేక దుంగలా మిగిలిన బూరుగును చూస్తునే పెద్దగా నవ్వుతూ, "నా పని నువ్వే చేసేశావే! మంచిది. ఇకనైనా బుద్ధి తెచ్చుకో! ఒళ్ళు దగ్గరపెట్టుకుని అతిగా గర్వముతో విర్రవీగకుండా బతుకు." అని హేళన చేసి వెళ్ళిపోయాడు.
శాల్మలి సిగ్గుతో తలవంచుకుంది.
Labels: బ
భారతంలో గాంధారం
Wednesday, March 5, 2008
ఈ విషయం తెలియగానే తన తాత కురువంశాన్ని మోసం చేశాడని మండిపడ్డ దుర్యోధనుడు తాత, మేనమామలను భూగృహంలో బందీలుగా చేసి, రోజుకు ఒక్కొక్కరికి ఒక్కో మెతుకు మాత్రమే ఆహారంగా అందివ్వమంటాడు. (సరిగా గుర్తులేదుగానీ సుబలుడికి కూడా వందో, ఇంకా ఎక్కువమందో ఉన్నారు కొడుకులు.) అలా ఐతే నిజంగానే అందరమూ అన్యాయంగా చచ్చిపోతామని గ్రహించిన సుబలుడు ఆ మెతుకులన్నీ శకుని ఒక్కణ్ణే తినమని, తను చచ్చిపోయాక మహిమగల తన అస్థికల సాయంతో దుర్యోధనుడి మీద పగతీర్చుకోమని చెప్తాడు. అలా వారిలో శకుని ఒక్కడే బతికి బయటపడి దుర్యోధనుడికి నమ్మకం కలిగించి కృష్ణుడి అండ ఉండే పాండవుల మీదికి అతణ్ణి రెచ్చగొట్టి అతడి పతనానికి కారకుడయ్యాడు. బహుశా మాయాబజార్ సినిమాలో శ్రీకృష్ణుడికి ప్రియదర్శినిలో శకుని కనిపించింది ఇందుకేనేమో? జరాసంధుడి తర్వాత దుర్యోధనుడే కదా కృష్ణుడి ఆధిపత్యానికి అడ్డుగా నిలిచింది? మిగతావాళ్ళను కృష్ణుడు స్వయంగా నిర్మూలించగలిగాడు గానీ వీళ్ళిద్దరి విషయంలోనే పాండవుల సాయం అవసరమైంది.
1. కుండకుడు = bastard!
2. గోళకుడు = విధవాపుత్రుడు
సుందోప సుందులు
Friday, December 14, 2007
ప్రకృతే వారి తపోదీక్షకు స్తంభించిపోయింది. లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. దేవతలంతా కలిసి బ్రహ్మ దగ్గరకు పరిగెత్తి వారి తపస్సును ఆపమని వేడుకున్నారు. అంతట ఆ బ్రహ్మ సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమై వారి కోరికలేమిటో అడిగాడు. అంతట వారు నమస్కరించి " స్వామీ ! ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగే కామగమన విద్యనూ, ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలిగే కామరూప విద్యనూ, సకల మాయా ప్రదర్శన శక్తిని అనుగ్రహించండి. ఎవరివల్లా మాకు చావు లేకుండా అమరత్వాన్ని ప్రసాదించండి " అని వేడుకున్నారు. " అమరత్వమా ! అది కుదరని పని . అయితే ఎవరి వల్లా మీకు చావు రాదు. మీవల్ల మీరే మరణిస్తారు. " అన్నాడు బ్రహ్మ.
అంతట ఆ సుందోపసుందులు విజృంభించిపోయారు. అసలే రాజుగారి పిల్లలవటం చేత వచ్చిన అతిశయం, బ్రహ్మదేవుని వరాలు కలిసి తోక తెగిన కోతుల్లా లోకాల మీద పడ్డారు. జపతపాలు ఆగిపోయాయి. యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. మున్యాశ్రమాల మీదకు మదపుటేనుగుల్లా, తోడేళ్ళలా, సింహాల్లా కామరూపాలతో దాడి చేసేవారు. ప్రపంచంతా అల్లకల్లోలమైంది. వారి హింసాకాండను భరించలేక దేవ గాంధార్వ సిద్ధ గణాలు బ్రహ్మను ప్రార్ధించగా.. విశ్వకర్మను పిలిచి "నీ ప్రతిభనంతా ఉపయోగించి అతిలోక సౌందర్యరాశిని సృష్టించాలి. " అన్నాడు.
ఆయన అలాగే శ్రమించి ఒక సౌందర్యరాశిని సృష్టించాడు. బ్రహ్మ ఆమెకు ప్రాణం పోశాడు. ఆ అందాల భామ తిలోత్తమ అందానికి, శరీర లావణ్యానికి అందరూ అబ్బురపడ్డారు. బ్రహ్మ ఆమెని పిలిచి " నీ మూలంగా సుందోపసుందుల మధ్య విరోధం రావాలి. ఆ కోపంలో ఇద్దరూ ఒకరినొకరు చంపుకోవాలి. వాళ్లిద్దరికీ అన్ని మాయలు తెలుసు. అంతకు మించిన మాయలు చూపాలి నీవు " అన్నాడూ. అంత తిలోత్తమ బ్రహ్మా ఆదేశానుసారం వెళ్ళి సుందోపసుందుల కంటపడేలా సంచరించింది. "ఈమె నా ప్రాణం" అని అన్నగారంటే, " ఈ అతిలోక సుందరి నా భార్య, నీకు మరదలవుతుంది. దూరంగా ఉండు" అని ఉపసుందుడన్నాడు. ఒకరు కుడిచేతిని, ఒకరు ఎడమచేతిని పట్టుకున్నారు.
అంతే. అంతవరకూ పరస్పర వాత్సల్యంతో ఉన్న ఆ అన్నదమ్ములిద్దరూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆమె తనకు దక్కాలంటే తనకు దక్కాలని ఘోరంగా పోట్లాడుకున్నారు. చివరికి ఒకరికొకరు పొడుచుకుని రక్తం కక్కుకుని నేలకూలారు. అది విని ముల్లోకాలు పండగ చేసుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అన్నదమ్ములు మధ్య మోహం కలహానికి కారణమై వారి పతనానికి దారి తీస్తుంది ..
Labels: స
జ్వరం
Sunday, November 25, 2007
ప్రమధగణాల ధాటికి ఆగలేక యజ్ఞం మృగరూపం ధరించి పారిపోయింది. ఉగ్రతాండవం చేసిన శివుని నుదుట చెమట పట్టింది. ఆ చెమటబిందువు కింద పడి పెద్ద మంటలు లేచాయి. ఆ మంటల్లోంచి భయంకరాకారుడైన పురుషుడొకడు పుట్టాడు. అతని చూసి భయంతో దేవతలూ, మునులూ తలో దిక్కుకు పారిపోయారు.అప్పుడు బ్రహ్మదేవుడు వచ్చి " దేవా! శాంతించు. దేవతలు నీకు హవిర్భాగం కల్పిస్తారు" అని ప్రార్ధించాడు. అంతట రుద్రుడు శాంతించాడు. యాగం ముగిసింది. అంతట బ్రహ్మదేవుడు" దేవా! నీ నుదుటి చెమట వల్ల పుట్టిన పురుషుడు "జ్వరం" అనే పేరుతో సర్వత్రా సంచరిస్తాడు. కాని అతడు ఒకే రూపంలో ఉంటే నేలతల్లికి భారమవుతాడు. బహువిధాలుగా చేయవా?" అని ప్రార్ధించాడు. అప్పుడు శివుడు "ఈ జ్వరం గురులకు శిరస్థానంగానూ, పాములకు కుబుసంగానూ, గోవులకు అరికాలి గిట్టలలొ బాధగానూ, మృగాలకు తమ స్వరూపాలను చూడలేక పోవడంగానూ, గుర్రాలకు పార్స్వశోషణంగానూ, నెమళ్ళకు ఈకలు రాలిపోవడంగానూ, కోకిలలకు నేత్రవ్యాధిగానూ, మనుష్యులకు చావుపుట్టుకల్లో కలిగే బాధగానూ అ జ్వరాన్ని విభజించాడు.
వృత్రాసురుడికి, ఇంద్రుడికి యుద్ధం జరిగినప్పుడు పరమేశ్వర తేజం జ్వరరూపం ధరించి వచ్చి వృత్రాసురుణ్ణి చుట్టుకుంది. లేకపోతే ఇంద్రుడు ఓడిపోయేవాడే. ఒకసారి ఇంద్రుడు, వృత్రాసురుడి మధ్య యుద్ధం జరిగింది. వృత్రుని మాయాబల ప్రభావం వల్ల ఇంద్రుడు మూర్చపోయాడు.అప్పుడూ వశిష్టుడు తన తపశ్శక్తితో అతనికి స్పృహకలిగించాడు.ఇంద్రుడికి జయం ఇవ్వవలసిందని పరమేశ్వరుడిని ప్రార్ధించగా ఆ దేవదేవుడు జ్వరరూపం ధరించి వృత్రాసురుణ్ణి చుట్టుముట్టాడు. తరువాత జ్వరం వజ్రాయుధంలో ప్రవేశించేసరికి ఇంద్రుడు దానిని ప్రయోగించి వృత్రాసురుడిని కూల్చాడు. వజ్రంలో ఉన్న విష్ణుస్పర్శ వల్ల వృత్రాసురుడి పాపాలన్నీ పోయి అతనికి అనంతశాంతి లభించింది.
వృత్రాసురుడి ప్రాణం పోగానే ఇంద్రుణ్ణి బ్రహ్మహత్యాపాతకం చుట్టుకుంది. ఇంద్రుడు వెళ్ళి తామర తూడులో దాక్కున్నా వదలలేదది. అప్పుడు ఇంద్రుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకోగా ఆయన బ్రహ్మహత్యాపాతకాన్ని నాలుగు భాగాలు చేసి అగ్నికీ, ఔషధవృక్షాలకూ, స్త్రీలకూ,నీటికీ సమంగా ఇచ్చాడు. వాళ్ళు భయపడి "స్వామీ! ఈ పాపం నుంచి మాకు నిష్కృతి లేదా?" అని అడిగారు. "నువ్వు ప్రజ్వల్లిరకుండానే నీలో హవిస్సు వ్రేల్చిన వాళ్ళకు నీలో ఉన్న దోషం సంక్రమిస్తుంది" అని అగ్నికి, 'పర్వకాలంలో మిమ్మల్ని చేదించిన వాళ్ళకు మీ పాపం చెందుతుంది" అని ఔషధ వృక్షాలకు, "రజస్వలలై ఉన్న మిమ్మల్ని చేపట్టిన వాళ్ళకు మీ పాపం సంక్రమిస్తుంది" అని స్త్రీలకూ,"మీలో మల మూత్ర శ్లేష్మాలు ఎవరు విడిస్తే వాళ్ళకు మీ పాతకం చుట్టుకుంటుంది" అని నీటికి చెప్పాడు బ్రహ్మ.
ఆ రకంగా కల్మషరహితుడైన ఇంద్రుడు అశ్వమేధయాగం చేసి మళ్ళీ సర్వలోకపూజ్యుడై ప్రకాశించాడు. వృత్రాసురుడి రక్తంలో పుట్టిన బుడగలు పుట్టకొక్కులై మనుష్యులకు ఆహారమయ్యాయి.
Labels: జ
అష్టావక్రుడు
Monday, October 8, 2007
అయినప్పటికీ ఉద్ధాలకుడు అతని మీద ప్రేమతో తన కూతురు సుజాతనిచ్చి పెళ్ళి చేశాడు. కహోలుడికీ, సుజాతకూ ఒక కొడుకు కలిగాడు. తల్లి కడుపులో వున్నప్పుడే తాత చదివే వేదాలన్నీ విని నేర్చుకున్నాడు. కాని తండ్రి కహోలుడు వేదాధ్యయనం చేసేటప్పుడు తప్పులు దొర్లేవి. ఆ అపశబ్దాలు వినలేక ఆ పిల్లవాడు తల్లి గర్భంలోనే వంకరలు వంకరలుగా ముడుచుకుపోయేవాడు. అవి అతని శరీరంలో అలాగే నిలిచిపోయాయి. అలా ఎనిమిది వంకర్లతో పుట్టడంవల్ల అతనికి అష్టావక్రుడన్న పేరు వచ్చింది.
అష్టావక్రుడు చిన్నతనంలోనే గొప్ప విద్వాంసుడైనాడు. పన్నెండేళ్ళు వచ్చేసరికి వేద వేదాంగాలన్నీ చదువుకున్నాడు.ఒకసారి జనక మహారాజు మిధిలా నగరంలో పెద్దయాగం చేస్తున్నాడని తెలిసి , తన బంధువూ, మిత్రుడూ అయిన సువేదకేతువును వెంటపెట్టుకుని అష్టావక్రుడు మిధిలకు వెళ్ళాడు. అక్కడ రాజభటులు వాళ్ళిద్దర్నీ లోపలకు పోనీయలేదు. అప్పుడు అష్టావక్రుడు రాజభటులతో "నాయనలారా! గుడ్డివాళ్ళకు, కుంటివాళ్ళకు, స్త్రీలకు మహారాజే తప్పుకుని దారి ఇవ్వాలి. వేదాలు, ఉపనిషత్తులు చదువుకున్న విద్వాంసులూ, పెద్దలూ దారిన పోతుంటే -రాజైనా సరే - వారిని పక్కకు తొలగిపొమ్మనకూడదు. ఇది శాస్త్రం చెబుతోంది. " అన్నాడు.
ఈ వాదం రాజుగారికి తెలిసి ఆ పిల్లవాడి తెలివితేటలకు ఆనందపడి "నిజమే! ఆ బాలకుడు చెప్పినదాంట్లో అబద్ధమేమీ లేదు. నిప్పుకి మన తన భేదం లేదు. కాలుతుంది. కాలుస్తుంది. పిల్లవాడు చిన్నవాడైనా ఉద్ధండుడిలా వున్నాడు" అనుకుని ఆ బాలకులను లోపలికి పంపమని భటుల్ని ఆదేశించాడు. కానీ, మరోచోట ఇంకో ద్వారపాలకుడు అడ్డగించాడు. "ఇక్కడికి మీబోటి చిన్నపిల్లలు రాకూడదు. వేదం చదివిన పెద్దలు మాత్రమే రావాలి" అన్నాడు.
"మేం చిన్నపిల్లలం కాము, వేదాలు అధ్యయనం చేసాం. అయినా పైపై మెరుగులు చూసి, ఆకారం చూసి, వయస్సు చూసి ఎవరిని పెద్ద, చిన్న అని అంచనా వెయ్యకూడదు. ఆకారాన్ని బట్టి పాండిత్యం రాదు. వయస్సు వచ్చినంత మాత్రాన వృద్ధులు గారు_ జ్ఞానం చేత పండినవారే వృద్ధులు . తెలివి ఉన్నవాడే మనిషి" అని ప్రవచించాడు అష్టావక్రుడు.
అంతట రాజుగారు అక్కడికి వచ్చి , " మా పండితులందరూ మహా విద్వాంసులు. అటువంటివాళ్ళతో వాదించాలనే కోరిక నీకెందుకు కలిగిందో నాకు తెలీదు. ఒకవేళ నీవు ఆ వాదంలో ఓడిపోతే నిన్ను సముద్రంలోకి తోస్తారు. అందుకు సిద్ధమేనా?" అని అడిగాడు.
"మహారాజా! మీరు చెప్పినదానికి నేను ఒప్పుకుంటున్నాను.కాని వాళ్ళు నాతో వాదించలేరు. ఆ సంగతి నాకు తెలుసు. పండితులమని, అన్నీ తెలిసినవాళ్ళమని అహంభావంతో వున్నారు వాళ్ళు. వాళ్ళు చేసిన అవమానం వల్లే మా తండ్రి సముద్రంలో దూకి ప్రాణాలు పోగొట్టుకున్నట్టు మా అమ్మ చెప్పింది. అందుకని పట్టుదలతో వచ్చాను.మీ పండితుల్ని ఎదిరించి వాదించగలను. లేకపోతే నేను కూడా సముద్రంలోకి దూకుతాను. "అని కోరాడు అష్టావక్రుడు.
అందుకు జనక మహారాజు ఒప్పుకున్నాడు. అష్టావక్రుడి ప్రశ్నలకు ఎవరూ సరిగా సమాధానం చెప్పలేకపోయారు. అష్టావక్రుడు గెలిచినట్తు ప్రకటించారు. పందెం ప్రకారం ఓడిపోయిన వాళ్ళందరూ సముద్రంలో దూకారు. తన ప్రతిభాపాండిత్యాలతో తండ్రి కహోలుడికి ఆత్మశాంతి కలిగించాడని అష్టావక్రుణ్ణి లోకం కొనియాడింది.
కనుక చదువు సంధ్యలు లేని తల్లిదండ్రులకు పుట్టిన పిల్లలు స్వయంకృషితో పెద్దల ప్రోత్సాహంతో మేధావులుగా రూపొందవచ్చు. పండితుడి కడుపున పరమ శుంఠ జన్మించవచ్చు. దేహబలం లేని తండ్రికి బలాఢ్యులైన పిల్లలు పుట్టవచ్చు. కేవలం అనువంశిక లక్షణాల్ని బట్టి, పైపై ఆకారాలను బట్టి ఎవర్నీ అంచనా వేయకూడదు.
Labels: అ