<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://www.blogger.com/navbar/1254698467234035774?origin\x3dhttp://jagannaatakam.blogspot.com', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

రెంటికి చెడ్డ రేవడి

Tuesday, September 14, 2010

మహాభారత సంగ్రామంలో ఎవరి పక్షాన చేరకుండా ఉండిపోయింది ఇద్దరు వ్యక్తులు . బలరాముడు, రుక్మి. బలరాముడు అందరూ క్షేమంగా ఉండాలని కోరుకునే శాంతికాముకుడు. మహాజన క్షయకరమైన కురుపాండవ యుద్ధం అతనికి ఇష్టం లేదు. తమ్ముడంటే అమితమైన ప్రేమ, అభిమానం, గౌరవం ఉన్నా కౌరవుల పతనం అతనిని అమితంగా కలత పెట్టింది.. అన్నదమ్ములు ఒకరినొకరు శత్రువుల్లా చంపుకోవడం ఆయనకు చాలా బాధ కలిగించింది. అందుకే తీర్థయాత్రల  పేరుతో సరస్వతీ నదీతీరానికి వెళ్లిపోయాడు.

భీష్మక మహారాజు కుమారుడు , శ్రీకృష్ణుని దేవేరి రుక్మిణిదేవి సోదరుడు రుక్మి మిక్కిలి పరాక్రమవంతుడు. ఇంద్రుడికి ప్రాణస్నేహితుడు కూడా. అతను ధ్రుముడనే కింపురుషుడి అనుగ్రహం వల్ల "విజయం"అనే దివ్య ధనుస్సు సంపాదించాడు. లోకంలో అత్యంత శ్రేష్టమైన దివ్య ఆయుధాలు మూడే ఉన్నాయి. దేవతల ధనుస్సులు ఏవీ వాటికి సరిరావు. వాటిలో ఒకటి విష్ణుమూర్తి "శార్ఞం" అనే ధనువు శ్రీకృష్ణుడు ధరించాడు. మరొకటి ఖాండవవన దహన సమయంలో అగ్నిదేవుడు అర్జునుడికి బహూకరించిన "గాండీవం". మూడవది రుక్మి దగ్గరున్న "విజయం".  గతంలో రుక్మిణీదేవిని ఎత్తుకెళ్తున్న కృష్ణుడిని ఎదిరించి అవమానాలపాలయ్యడు రుక్మి.

మహాభారత సంగ్రామ జరగడం తథ్యం అని తెలిసి ఒక అక్షౌహిణి సేనతో పాండవుల వద్దకు వెళ్లాడు రుక్మి. అతిథి మర్యాదలు స్వీకరించిన పిమ్మట అర్జునుడిని పిలిచి "అర్జునా! రాబోయే మహాసంగ్రామం గురించి భయపడకు. నన్ను మించిన వీరుడు, పరాక్రమవంతుడు లేడు. నా వద్ద శక్తివంతమైన ధనుస్సు ఉంది. దాని సహాయంతో భీష్మ, ద్రోణ, కర్ణ, కృపాది మహావీరులని మట్టి కరిపించి నీ రాజ్యం నీకు అప్పగిస్తాను" అని బీరాలు పలికాడు. అదివిని అర్జునుడు నవ్వుకుని " మహావీరా! మాకు సహాయం చేస్తానన్నందుకు దన్యవాదాలు.  నీకు తెలుసు కదా మాకు ఆ దేవదేవుడైన శ్రీకృష్ణుడు అండగా ఉన్నాడు. ఆయన ఉండగా ఇక వేరేవారి సాయం అవసరం ఉంటుందా? పైగా నా దగ్గర గాండీవం ఉంది. ఆ ఇంద్రుడే వచ్చినా నేను భయపడను " అన్నాడు. అది విన్న రుక్మి కోపంతో తన సేనతో   సుయోధనుడి దగ్గరకు వెళ్లాడు.

"దుర్యోధనా! నేను నీ పక్షాన ఉంటాను. నా ధనుస్సుతో పాండవులను అంతం చేసి స్వర్గానికి చేరుస్తాను. నీకు విజయం తథ్యం. నా ప్రతాపం చూపిస్తాను" అన్నాడు రుక్మి. అభిమానధనుడైన రారాజు అతడిని సున్నితంగానే నిరాకరించాడు. ఇక చేసేది లేక రుక్మి  సిగ్గుతో వచ్చినదారినే తన నగరానికి వెనుదిరిగాడు.

అందుకే ఎప్పుడు కూడా తన శక్తియుక్తుల్ని అధికంగా ఊహించుకోవడం, ఎదుటివారి తెలివితేటల్ని, శక్తిని తక్కువగా అంచనా వేయడం ఎవరికి మంచిది కాదు. అలా చేయడం వల్ల అవమానమే తప్ప వేరే ఫలితం ఉండదు.

Labels:

posted by జ్యోతి, 5:25 AM | link | 1 comments |

చెప్పులూ, గొడుగూ...

Monday, February 1, 2010

"ఇదిగో బాణం విడిచిపెడుతున్నా! " శరాన్ని సంధించి జమదగ్ని మహాముని భార్య రేణుకాదేవి వైపు చూశాడు.

"ఊ"

"చాలా దూరం వెడుతుంది సుమా!"

"ఎంత దూరం వెళ్లినా తేగలను."

"అలాగేం? సరే! చూడు మరి."

జమదగ్ని బాణం విడిచాడు. రేణుకాదేవి పరుగెత్తింది.

ఒకరోజు వాళ్లిద్దరికి సరదాగా ఆటపాటలతో గడపాలని బుద్ధి పుట్టింది. అందుకే పొద్దున్నే బాణాలూ, విల్లూ తీసుకుని బయలుదేరారు. చాలా దూరం నడిచి ఒక ఆరుబయలు ప్రదేశం చేరుకున్నారు.

జమదగ్ని బాణాలు వేయడం, ఆమె పరుగెత్తి ఆ బాణం ఎక్కడ పడిందో కనుక్కుని తెచ్చి ఇవ్వడం .. ఇదీ ఆట.

ఆ ఆట ఇద్దరికీ నచ్చింది.. కాని జమదగ్నికి జాలేసింది తన భార్య కనుక్కోగలదో లేదో అని.

"ఇదిగో బాణం తెచ్చాను!" అని నవ్వుతూ అందించింది రేణుకాదేవి.

అలా జమదగ్ని బాణాలు వేస్తూనే ఉన్నాడు. ఆమె కనుక్కుని తెస్తూనే ఉంది. కాని ఒకసారి అలా వెళ్లిన రేణుకాదేవి ఎంతసేపటికీ తిరిగిరాలేదు. జమదగ్ని చాలాసెపు ఎదురు చూశాడు. చివరికి నీరసంగా , మెల్లిగా నడుచుకుంటూ వచ్చింది.

"రేణుకా! ఏమైంది ఈసారి ఆలస్యం చేసావు?"

" అదిగో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కాళ్ళు బొబ్బలెక్కి ఆయాసంగా ఉంటే కాస్సేపు ఒక చెట్టు కింద కూర్చుని వస్తున్నాను."

అలిసిపోయి ముఖం మీది చెమటను చీరచెరుగుతో తుడుచుకుంటున్న రేణుకాదేవిని చూసి జమదగ్ని బాధపడి " ఈ సూర్యుడు నిన్ను ఇంతగా బాధపెట్టాడా? అతని పని చెప్తానుండు " అంటూ కోపంతో సూర్యుడివైపు అస్త్రం సంధించాడు.

ఇంతలో ఒక బ్రాహ్మణుడు గబగబా వచ్చి ఆయన చేతిని పట్టుకున్నాడు.

"మహర్షీ! శాంతించు. సూర్యుడు లేకుండా ముల్లోకాలు నిలుస్తాయా? ఆలోచించు."

"నాకు అదంతా తెలీదు. సూర్యుడు నా భార్యను బాధపెట్టాడు. అతను శిక్ష అనుభవించి తీరాలి" అని గర్జించాడు.

మరుక్షణమే ఆ బ్రాహ్మణుడు "అయ్యా! నన్ను క్షమించు. నేనే సూర్యున్ని. దయ చూపుము" అని ప్రార్ధించాడు.

ఆ వెంటనే చెప్పులు, గొడుగూ సృష్టించి " ఇవిగో! ఈ పాదరక్షలు ధరించి, ఈ చత్రముతో శిరస్సుకు నీడపడితే నా వేడి సోకదు. ఇవి తల్లి రేణుకాదేవికి ఇవ్వండి" అని జమదగ్ని మహర్షికి సమర్పించుకున్నాడు.

అది చూసి జమదగ్ని శాంతించాడు. సూర్యుడు అంతర్ధానమయ్యాడు.

ఆ గొడుగును , చెప్పులనూ చూసి ప్రజలంతా కూడా సంతోషించారు. తాపసుల కోపం కూడా లోకకళ్యాణానికే దారితీస్తుందని రకరకాలుగా గొడుగులూ, చెప్పులనూ తయారు చేసి వినియోగించడం ప్రారంభించారు.


సూర్యుడి చేత సృష్టించబడినవి గనుక అవి పవిత్రమైనవి. వాటిని సజ్జనులకు, బీదసాదలకు, సాధువులకు దానం చేస్తే చాలా పుణ్యం. అవి చాలా పవిత్రమైనవి కావున పితృకార్యాలలో కూడ వినియోగిస్తారు.

Labels:

posted by జ్యోతి, 6:41 PM | link | 1 comments |

ఖాండవ వన దహనం

Monday, February 16, 2009

శ్వేతకి అనే రాజుగారు దుర్వాసమహర్షి పర్యవేక్షణలో సుమారు వందేళ్ల పాటు ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించాడు. దిగ్విజయంగా ముగిసిన యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు. కాని నిత్యం హోమాగ్నిలో ఆజ్యం పోయడం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి చేసింది. ఆహారం పట్ల విముఖత ఏర్పడింది. అంతట అగ్నిదేవుడు బాధా నివారణకు బ్రహ్మ దేవుడిని అర్చించి తరుణోపాయం కోరగా .. " ఖాండవవనంలో అనే రకాల దివ్య ఓషధులు ఉన్నాయి, అలాగే దేవతలకు శత్రువులైన కొన్ని జంతువులున్నాయి. వనాన్ని దహించి నీ బాధను పోగొట్టుకోవచ్చు. ఓషధుల మూలంగా నీ ఆరోగ్యం బాగుపడుతుంది. శత్రుసంహారమూ జరుగుతుంది" అని సలహా ఇచ్చాడు సృష్టికర్త..

నివారణోపాయాన్ని తెలుసుకున్న అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించడానికి ఉపక్రమించాడు. కాని వనంలో ఇంద్రుని స్నేహితుడైన తక్షకుడు తన భార్యా పిల్లల్లతో ఉంటున్నాడు. తన స్నేహితుడిని రక్షించడానికి ఇంద్రుడు పూనుకున్నాడు. అగ్నిదేవుడు వనాన్ని దహించడం మొదలుపెట్టగానే ఇంద్రుడు కుండపోతగా వర్షం కురిపించాడు. వనాన్ని ఎలాగైనా దహించి తన ఆరోగ్య సమస్యను తీర్చుకోవాలన్న కృతనిశ్చయంతో అగ్నిదేవుడు వరుసగా ఏడురోజులు ప్రయత్నించినా విఫలుడయ్యాడు. మళ్లీ బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోగా "నరనారాయణులు భూమిపై కృష్ణార్జునులుగా అవతరించినప్పుడు నీ కోరిక నెరవేరుతుంది. వేచి ఉండుము" అని ఉపాయం చేప్తాడు బ్రహ్మదేవుడు.

కృష్ణార్జునులు ఇంద్రప్రస్తంలో ఉన్నప్పుడు యమునాతీరాన విహారానికి చేస్తుండగా అగ్నిదేవుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వారి వద్దకు వెళ్లి తన వ్యాధి గురించి చెప్పి సహాయం అర్ధించాడు. తర్వాత తన నిజరూపంలో ఖాండవ వనాన్ని దహనం చేయాలనే కోరికను వెలిబుచ్చాడు. కానీ సమయంలో కృష్ణార్జునుల వద్ద ఎటువంటి ఆయుధాలు లేవు. అది గమనించి అగ్నిదేవుడు వరుణ దేవుడిని ప్రార్ధించగా, అతను ప్రత్యక్షమై అర్జునుడికి చంద్రధనుస్సు (గాండీవం) , దానితో పాటు అక్షయ తూణీరం ఇచ్చాడు. తూణీరంలో ఎన్ని బాణాలు తీసివేస్తున్నా అది ఖాళీ కాదు. ఎప్పుడూ శరసమృద్ధమై ఉంటుంది. దానికి తోడూ కపిరాజు చిత్రంతో ఉన్న ధ్వజాన్ని అమర్చి, బలిష్టమైన నాలుగు అశ్వాలు పూన్చి నాలుగింటికీ కళ్ళేలుగా నాలుగు బంగారు గొలుసులు ఉన్న దివ్య రధాన్ని ఇచ్చాడు.

కృష్ణార్జునులు ఖాండవవన సరిహద్దుల్లో నిలబడి కాపలా కాస్తూ వనాన్ని దహించమని అగ్నికి చెప్పారు. అగ్ని జ్వాలలకు తట్టుకోలేక అడవిలో తపస్సు చేసుకుంటున్న మహర్షులు ఎటూ పోలేక రక్షించమని దేవేంద్రుణ్ణి వేడుకున్నారు. అతని ప్రభావంతో ఉరుములు , మెరుపులతో వర్షం మొదలైంది. వెంటనే అర్జునుడు ఆకాశంలో అమ్ములతో ఛత్రం ఏర్పరిచి వాన జల్లు అడవిలో పడకుండా అడ్డుకున్నాడు. సమయానికి తక్షకుడు కురుక్షేత్రం వెళ్ళాడు. అతని కొడుకు అశ్వసేనుడు మంటల్లో చిక్కుకుని గిలగిల్లాడసాగాడు. కొడుకును కాపాడడానికి అతని తల్లి అతన్ని మింగి దూరంగా విసిరేయాలనుకుంది. అది గమనించిన అర్జునుడు అశ్వసేనుడు తల నరకబోయాడు. వెంటనే ఇంద్రుడు గాలి దుమ్ము రేపాడు. కళ్ళలోకి ధూళి పోవడంతో అర్జునుడి గురి తప్పింది. అశ్వసేనుడు రక్షింపబడ్డాడు. అశ్వసేనుడు తలదాచుకునేందుకు ఎక్కడా చోటు దొరకరాదని అగ్ని, కృష్ణార్జునులు శపించారు.

బాణాల గొడుగు చాటున అగ్ని ఖాండవవనాన్ని దహిస్తున్నాడు. అతిప్రయాసతో తప్పించుకుని బయటకు వచ్చిన పాములను, డేగలను అర్జునుడు వధించాడు. మరోపక్క కృష్ణుడు అసురులను మట్టికరిపించాడు. దేవతలందరూ ఇంద్రుడికి యుద్ధంలో సహాయపడినా ఇంద్రుడు ఓడిపోయాడు. కృష్ణార్జునులు విజయం సాధించారు. ఖాండవవనాన్ని సమూలంగా దహించిన అగ్నిదేవుడు తిరిగి ఉజ్వలంగా ప్రకాశించాడు.

Labels:

posted by జ్యోతి, 7:24 PM | link | 4 comments |

ఆకలి బాధ

Saturday, September 6, 2008

పూర్వం విదర్భ రాజ్యాన్ని సుదేవుడి కొడుకు శ్వేతుడు పాలించేవాడు. అతను గొప్ప తపస్సంపన్నుడు, జ్ఞానశీలి, ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించి తపశ్శక్తితో దైవత్వాన్ని పొందాడు.

కొంతకాలానికి మరణించిన శ్వేతుడిని విష్ణుభక్తులు వచ్చి స్వర్గానికి తీసికెళ్ళారు. అక్కడ దేవకన్యలు సేవిస్తుంటే భోగభాగ్యాలు అనుభవిస్తూ సంతోషంగా ఉన్నాడు. కాని అన్ని సుఖాలున్నా శ్వేతుడు ఆకలిబాధతో బాధపడుతున్నాడు. స్వర్గంలో ఉండేవాళ్ళకు అస్సలు ఆకలి అనేది ఉండదు ఆకలివేస్తే తినడానికి కూడా ఏమి ఉండదు. కాని శ్వేతుడికి స్వర్గలోకంలో కూడా ఆకలిబాధ తప్పలేదు.

ఆ బాధ తట్టుకోలేక ఒక రోజు బ్రహ్మ దగ్గరకు వెళ్లాడు. "స్వామి! నేను గొప్ప తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గానికి వచ్చాను. కాని నాకు ఆకలి బాధ తప్పలేదు. స్వర్గంలో ఉన్న మిగతావారికి ఆకలి ఉండదు కాబట్టి ఇక్కడ తినడానికి ఏమీ దొరకడంలేదు. ఈ బాధ తప్పే ఉపాయం చెప్పండి " అని వేడుకున్నాడు.

అతని మాటలు విన్న బ్రహ్మ " మహారాజా! నువ్వు గొప్ప తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గలోకానికి వచ్చావు. కాని ఎవ్వరికీ లేని ఆకలిబాధ నీకు కలిగింది. దానికి కారణం చెప్తాను విను. నువ్వు ఎవరి ఆకలి బాధ తీర్చలేదు. ఎవరికి పట్టెడు అన్నం పెట్టలేదు. దాహమన్న వాళ్ళకి మంచినీళ్ళివ్వలేదు. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. అది నువ్వు చేయలేదు. అందుకే "ఆకలిబాధ" అంటే ఏమితో ఇప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావు" అన్నాడు బ్రహ్మ.

"స్వామి ! మరి నా ఆకలిబాధ తీరే మార్గం లేదా?. నన్ను కాపాడండి." అని వేడుకున్నాడు శ్వేతుడు.

" శ్వేతా! నువ్వు భూలోకంలో నీ శవం ఎక్కడుందో వెతికి, అక్కడికి వెళ్ళి రోజూ కొంచెం కొంచెం తిని నీ ఆకలి బాధ తగ్గించుకో. నువ్వు ఎంత తిన్నా కూడా ఆ భాగం మళ్ళీ పెరుగుతుంది. అది ఎప్పటికి తరగదు" అన్నాడు బ్రహ్మ.

"స్వామీ! అలా నా శవాన్ని నేను ఎంతకాలం తినాలి?" అని అడిగాడు శ్వేతుడు.

"అగస్త్య మహర్షి నీ దగ్గరకు వచ్చి నిన్ను పలకరించేవరకు తింటూనే ఉండు. !" అన్నాడు బ్రహ్మదేవుడు.

బ్రహ్మ చెప్పినవిధంగా శ్వేతుడు రోజూ భూలోకం వెళ్ళి తన శవం ఎక్కడుందో వెతుక్కుని రోజూ తింటు ఆకలి తీరాక తిరిగి వస్తున్నాడు. మర్నాడు వెళ్ళేసరికి ఆ భాగం మళ్ళీ అలాగే ఉంటుంది. ఆ శవం కూడ కుళ్ళిపోకుండా, మనిషి పడుకున్నట్టే ఉంటుంది.

ఒకరోజు శ్వేతుడు ఆ శవాన్ని కోసుకుని తింటుండగా అగస్త్య మహర్షి చూసి ఆశ్చర్యపోయాడు. వెళ్ళి అతడిని పలకరించాడు. అప్పుడు " మహాత్మా! మిమ్మల్ని చూసిన నా జన్మ ధన్యమైనది. నా ఆకలి బాధ తీరింది. ఆకలిబాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవంతో తెలుసుకుని నేను చేసిన తప్పును అర్ధం చేసుకున్నాను" అని నమస్కరించి స్వర్గానికి వెళ్ళి సంతోషంగా ఉన్నాడు శ్వేతుడు.

దీని వలన మనకు తెలుసుకోవలసినదేమంటే ఆకలి అన్నవాళ్ళకి అన్నం పెట్టడం, దాహం అన్నవాళ్ళకి నీళ్ళివ్వడం ప్రతి మనిషి చేయవలసిన కనీస ధర్మం. అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పదని తెలుసుకోవడం మంచిది.

Labels:

posted by జ్యోతి, 5:22 PM | link | 1 comments |

బూరుగు గర్వభంగం

Thursday, May 1, 2008

బలవంతులతో దుర్భలులెప్పుడూ పోటీపడకూడదు. పెద్ద రాయి కింద చెయ్యి పెట్టకూడదని అనుభవజ్ఞులు చెబుతుంటారు.


హిమవత్ పర్వతం మీద ఒక పెద్ద బూరుగు వృక్షం ఉండేది. ఓసారి నారద మహర్షి దారిన వెడుతూ మధ్యలో బూరుగు దగ్గర ఒక క్షణం ఆగి " బూరుగా! హిమవత్ పర్వతం మీద నీ అంత పొడుగూ, వైశాల్యం కలిగిన చెట్టు మరేది లేదు. ఎన్నో పక్షులు నిన్ను ఆశ్రయించి జీవిస్తున్నాయి. గాలికి అన్ని చెట్లూ కూలిపోతాయి కాని నువ్వు మాత్రం చెక్కు చెదరకుండా నిలబడతావు. వాయుదేవుడు నీకు చుట్టమా. అతడు నిన్ను దయ తలచి రక్షిస్తున్నాడా" అని అడిగాడు.


బూరుగు వృక్షం మాటలకు పొంగిపోయింది.


"మునీంద్రా ! నా ముందు వాయుదేవుడెంత? అతని బలం నా బలంలో పదో వంతు కూడా రాదు" అంది గర్వంగా.


దేవర్షి చిన్నగా నవ్వి, " అంత మాటనకు. వాయుదేవుడు తలుచుకున్నాడంటే కొండలే కూలిపోతాయి. తెలుసా?" అన్నాడు.


"అదేమో నాకు తెలీదు. నా మొదలూ, కొమ్మలు చూసావా ఎంత బలంగా ఉన్నాయో . నన్ను తాకితే అతనికున్న ప్రభంజనుడనే బిరుదు కాస్తా పోతుంది." అంది బూరుగు.


"సరే, నీ ఇష్టం. వస్తా" అంటూ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు నారదుడు. సంగతంతా చిటికలొ వాయుదేవుడికి అందించేసాడు.


వాయుదేవుడు బూరుగు చెట్టు దగ్గరకు వెళ్ళి " ఏమే బూరుగా! ఏం వాగావు. నీకు నాకంటే ఎక్కువ బలం ఉందా.నేను నిన్ను ఏమీ చేయలేనా. మాటలెందుకు. కాచుకో" అన్నాడు కోపంగా.


"తేలిగ్గా మాట్లాడకు. లోకంలో ఉన్న వృక్షాలతో నేను సమానం కాను " అంది శాల్మలి.


"ఓహో! ఎంత గర్వం? ఐతే నువ్వు అన్ని వృక్షాలకంటే గొప్పదానివని విర్రవీగకు. బ్రహ్మదేవుడు నీ నీడలో నిలబడ్డాడన్న గౌరవం కొద్దీ నిన్ను ఏం చెయ్యకుండా ఇన్నాళ్ళూ వదిలేశాను. అందుకే ఇప్పుడిలా పొగరెక్కి మాట్లాడుతున్నావు. ఐతే సరే రేపు బలాబలాలు తేల్చుకుందాం" అని వెళ్ళిపోయాడు.


వాయుదేవుడు వెళ్ళిపోయాక బూరుగు వృక్షానికి భయం పట్టుకుంది. "అయ్యో, మహాబలుడైన వాయుదేవుడితొ ఎరగక విరోధం పెట్టుకున్నాను. రేపు నా గతేమిటి.నారదమహర్షి మాటలు వినకపోయాను కదా" అని విచారించింది.


మరుక్షణం కాస్త ధైర్యం తెచ్చుకుంది." "వాయుదేవుడొస్తే ఏం చేస్తాడు. ఆకులు రాల్చేస్తాడు. కొమ్మలు, రెమ్మలు విరిచేస్తాడు! . పని నేనే చేసుకుంటే ఇంక అతనేం చేయగలడు. అతను ఓడిపోయినట్టేగా!" అనుకుని బలాన్న్నంతా కూడగట్టుకుని తనకు తానే ఆకులు విదిలించుకుని, కొమ్మలన్నింటిని విరుచుకుని మోడై నిలబడింది.


తెల్లవారింది.


భయంకరంగా ధ్వని చేస్తూ వాయుదేవుడు వచ్చాడు. ఆకులు, కొమ్మలు లేక దుంగలా మిగిలిన బూరుగును చూస్తునే పెద్దగా నవ్వుతూ, "నా పని నువ్వే చేసేశావే! మంచిది. ఇకనైనా బుద్ధి తెచ్చుకో! ఒళ్ళు దగ్గరపెట్టుకుని అతిగా గర్వముతో విర్రవీగకుండా బతుకు." అని హేళన చేసి వెళ్ళిపోయాడు.


శాల్మలి సిగ్గుతో తలవంచుకుంది.

Labels:

posted by జ్యోతి, 9:45 PM | link | 1 comments |

భారతంలో గాంధారం

Wednesday, March 5, 2008

చిన్నప్పుడు దుర్యోధనుడు భీముణ్ణి తరచూ "కుండకా1! కుశలమేనా?" అని సంబోధించి ఎగతాళి చేసేవాడట. ఉడుకుబోతైన భీముడు చాలా రోజులు ఊరుకున్నా ఒకసారి మాత్రం తిరగబడి "కుశలమే గోళకా2!" అని ఘాటుగా సమాధానమివ్వడంతో దిమ్మతిరిగిపోయిన దుర్యోధనుడు అప్పుడేమీ మాట్లాడలేక ఊరుకున్నా అసలు తను గోళకుడెందుకయ్యాడా అని ఇన్వెస్టిగేట్ చేయిస్తాడు. (నేను చిన్నప్పుడు బాలమిత్రలో చదివిన ఈ కథ ఇంతవరకూ కల్పితమేమో గానీ ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడినట్లుగా చెప్తున్నది మాత్రం భారతంలో ఉన్న కథే:) గాంధారదేశానికి (ఇప్పటి ఆఫ్గనిస్తాన్ లోని కాందహార్ ప్రాంతం) రాజైన సుబలుడికి కూతురు (గాంధారి) పుట్టగానే ఆమె జాతకాన్ని పరిశీలించిన జ్యోతిష్కులు "ఆమె జాతకంలో వైధవ్యయోగముంది" అని చెప్పారు. దాంతో ఆ యోగాన్ని తప్పించడానికి ఆమెకు యుక్తవయస్సు రాగానే ముందు రహస్యంగా ఒక మేకపోతుతో పెళ్ళి జరిపించి, వెంటనే దాన్ని చంపేసి ఆమెను శాస్త్రోక్తంగా విధవను చేశారు. ఆ తర్వాత ఆ విషయాన్ని దాచిపెట్టి దూరదేశాన ఉన్న కురువంశానికి చెందిన ధృతరాష్ట్రుడికిచ్చి పెళ్ళి చేసి పంపేశారు. అలా కౌరవులు విధవాపుత్రులన్నమాట.

ఈ విషయం తెలియగానే తన తాత కురువంశాన్ని మోసం చేశాడని మండిపడ్డ దుర్యోధనుడు తాత, మేనమామలను భూగృహంలో బందీలుగా చేసి, రోజుకు ఒక్కొక్కరికి ఒక్కో మెతుకు మాత్రమే ఆహారంగా అందివ్వమంటాడు. (సరిగా గుర్తులేదుగానీ సుబలుడికి కూడా వందో, ఇంకా ఎక్కువమందో ఉన్నారు కొడుకులు.) అలా ఐతే నిజంగానే అందరమూ అన్యాయంగా చచ్చిపోతామని గ్రహించిన సుబలుడు ఆ మెతుకులన్నీ శకుని ఒక్కణ్ణే తినమని, తను చచ్చిపోయాక మహిమగల తన అస్థికల సాయంతో దుర్యోధనుడి మీద పగతీర్చుకోమని చెప్తాడు. అలా వారిలో శకుని ఒక్కడే బతికి బయటపడి దుర్యోధనుడికి నమ్మకం కలిగించి కృష్ణుడి అండ ఉండే పాండవుల మీదికి అతణ్ణి రెచ్చగొట్టి అతడి పతనానికి కారకుడయ్యాడు. బహుశా మాయాబజార్ సినిమాలో శ్రీకృష్ణుడికి ప్రియదర్శినిలో శకుని కనిపించింది ఇందుకేనేమో? జరాసంధుడి తర్వాత దుర్యోధనుడే కదా కృష్ణుడి ఆధిపత్యానికి అడ్డుగా నిలిచింది? మిగతావాళ్ళను కృష్ణుడు స్వయంగా నిర్మూలించగలిగాడు గానీ వీళ్ళిద్దరి విషయంలోనే పాండవుల సాయం అవసరమైంది.

1. కుండకుడు = bastard!
2. గోళకుడు = విధవాపుత్రుడు

Labels: ,

posted by త్రివిక్రమ్ Trivikram, 1:50 PM | link | 6 comments |

సుందోప సుందులు

Friday, December 14, 2007

హిరణ్యకశిపుని వంశంలో నికుంభుడనే రాజుగారికి ఇద్దరు పిల్లలు కలిగారు. వారే సుందోపసుందులు. అల్లరిలో ఒకరికొకరు తీసిపోరు రాజుగారి పిల్లలు కనుక గారాబంగా పెరిగారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగ ఉండేవాళ్ళు, ఒక్క క్షణం కూడ ఒకరిని విడిచి ఒకరుండేవారు కాదు. వారికి చిన్నప్పుడే ప్రపంచమంతా జయించాలన్న కోరిక కలిగింది. త్రిలోకాల్లో ఉన్న దేవతలు, మునులు, చక్రవర్తులు, యోధులు అందరినీ కేవలం భుజబలం తో ఓడించలేమని నార వస్త్రాలు కట్టి వింధ్య పర్వతం మీద తపస్సు చేసారు. ఆ తపస్సు నుండి పుట్టిన వేడికి భయపడ్డ దేవతలు ఎన్నో విఘ్నాలు కలిగించారు, నచ్చ చెప్పారు. అయినా సుందోపసుందులు వినలేదు.

ప్రకృతే వారి తపోదీక్షకు స్తంభించిపోయింది. లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. దేవతలంతా కలిసి బ్రహ్మ దగ్గరకు పరిగెత్తి వారి తపస్సును ఆపమని వేడుకున్నారు. అంతట ఆ బ్రహ్మ సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమై వారి కోరికలేమిటో అడిగాడు. అంతట వారు నమస్కరించి " స్వామీ ! ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగే కామగమన విద్యనూ, ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలిగే కామరూప విద్యనూ, సకల మాయా ప్రదర్శన శక్తిని అనుగ్రహించండి. ఎవరివల్లా మాకు చావు లేకుండా అమరత్వాన్ని ప్రసాదించండి " అని వేడుకున్నారు. " అమరత్వమా ! అది కుదరని పని . అయితే ఎవరి వల్లా మీకు చావు రాదు. మీవల్ల మీరే మరణిస్తారు. " అన్నాడు బ్రహ్మ.

అంతట ఆ సుందోపసుందులు విజృంభించిపోయారు. అసలే రాజుగారి పిల్లలవటం చేత వచ్చిన అతిశయం, బ్రహ్మదేవుని వరాలు కలిసి తోక తెగిన కోతుల్లా లోకాల మీద పడ్డారు. జపతపాలు ఆగిపోయాయి. యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. మున్యాశ్రమాల మీదకు మదపుటేనుగుల్లా, తోడేళ్ళలా, సింహాల్లా కామరూపాలతో దాడి చేసేవారు. ప్రపంచంతా అల్లకల్లోలమైంది. వారి హింసాకాండను భరించలేక దేవ గాంధార్వ సిద్ధ గణాలు బ్రహ్మను ప్రార్ధించగా.. విశ్వకర్మను పిలిచి "నీ ప్రతిభనంతా ఉపయోగించి అతిలోక సౌందర్యరాశిని సృష్టించాలి. " అన్నాడు.

ఆయన అలాగే శ్రమించి ఒక సౌందర్యరాశిని సృష్టించాడు. బ్రహ్మ ఆమెకు ప్రాణం పోశాడు. ఆ అందాల భామ తిలోత్తమ అందానికి, శరీర లావణ్యానికి అందరూ అబ్బురపడ్డారు. బ్రహ్మ ఆమెని పిలిచి " నీ మూలంగా సుందోపసుందుల మధ్య విరోధం రావాలి. ఆ కోపంలో ఇద్దరూ ఒకరినొకరు చంపుకోవాలి. వాళ్లిద్దరికీ అన్ని మాయలు తెలుసు. అంతకు మించిన మాయలు చూపాలి నీవు " అన్నాడూ. అంత తిలోత్తమ బ్రహ్మా ఆదేశానుసారం వెళ్ళి సుందోపసుందుల కంటపడేలా సంచరించింది. "ఈమె నా ప్రాణం" అని అన్నగారంటే, " ఈ అతిలోక సుందరి నా భార్య, నీకు మరదలవుతుంది. దూరంగా ఉండు" అని ఉపసుందుడన్నాడు. ఒకరు కుడిచేతిని, ఒకరు ఎడమచేతిని పట్టుకున్నారు.

అంతే. అంతవరకూ పరస్పర వాత్సల్యంతో ఉన్న ఆ అన్నదమ్ములిద్దరూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆమె తనకు దక్కాలంటే తనకు దక్కాలని ఘోరంగా పోట్లాడుకున్నారు. చివరికి ఒకరికొకరు పొడుచుకుని రక్తం కక్కుకుని నేలకూలారు. అది విని ముల్లోకాలు పండగ చేసుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అన్నదమ్ములు మధ్య మోహం కలహానికి కారణమై వారి పతనానికి దారి తీస్తుంది ..

Labels:

posted by జ్యోతి, 10:45 AM | link | 1 comments |