<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://www.blogger.com/navbar.g?targetBlogID\x3d1254698467234035774\x26blogName\x3d%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82\x26publishMode\x3dPUBLISH_MODE_BLOGSPOT\x26navbarType\x3dTAN\x26layoutType\x3dCLASSIC\x26searchRoot\x3dhttps://jagannaatakam.blogspot.com/search\x26blogLocale\x3den_US\x26v\x3d2\x26homepageUrl\x3dhttp://jagannaatakam.blogspot.com/\x26vt\x3d-5619112905543282348', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

భీష్ముడి పూర్వజన్మ

Wednesday, March 21, 2007

ఆపుడు, ధ్రువుడు, సోముడు, ధరుడు, అనిలుడు, అనలుడు, ప్రత్యూషుడు, ప్రభాసుడు అష్టవసువులు. భీష్ముడు గతజన్మలో అష్టవసువుల్లో ఆఖరివాడైన ప్రభాసుడు. ఒకసారి అష్టవసువులు లోకవిహారం చేస్తూ వశిష్ఠుడి ఆశ్రమానికి వస్తారు. అప్పుడు వశిష్ఠుడు ఆశ్రమంలో లేడుగానీ కామధేనువు పుత్రిక నందిని వుంది . ప్రభాసుడు తన భార్య ప్రేరేపించగా తన సోదరుల సాయంతో నందినిని తస్కరిస్తాడు. వశిష్ఠుడు తిరిగొచ్చాక వాళ్ళు చేసిన పని చూసి ఆగ్రహించి వాళ్ళు ఎనిమిది మందీ మనిషి జన్మ ఎత్తుతారని శపిస్తాడు. అప్పుడు మిగిలిన ఏడుగురు వసువులూ తప్పైపోయింది క్షమించమని ఆ మహర్షిని వేడుకోగా ప్రభాసుడొక్కడే తలబిరుసుతో ఆయన్ను తూలనాడుతాడు. దాంతో ఆ ముని వాళ్ళేడుగురికీ మనుషులుగా పుట్టగానే శాపవిమోచనమౌతుందని, ఎనిమిదోవాడు మాత్రం దీర్ఘకాలం కఠినతరమైన మానవ జీవితం గడపవలసి ఉంటుందని శాపాన్ని సవరిస్తాడు.


ఇది జరగడానికి పూర్వం ఇక్ష్వాకు వంశానికి చెందిన మహాభిషువు అనే రాజొకడు తన పుణ్యఫలం చేత బ్రహ్మలోకం చేరుతాడు. కానీ అక్కడ నిండు సభలో గంగాదేవిని మోహంతో మైమరచి చూస్తాడు. అది గమనించిన బ్రహ్మ కోపించి అతడిని భూమ్మీద మానవజన్మ ఎత్తమని శపిస్తాడు. అతడు ఆ శాపఫలితంగా భూమ్మీద కురువంశంలో శంతనుడై అవతరించగా గంగ అతడి మీద మోహంతో అతణ్ని వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది. ఆమెకు దారిలో అష్టవసువులు దీనవదనులై కనిపిస్తారు. ఆమె వారి దు:ఖానికి కారణమడుగగా వాళ్ళు ఆమెకు విషయం వివరిస్తారు. అప్పుడు ఆమె వారికి బెంగపడవద్దని, తాను కూడా భూలోకానికే వెళ్తున్నానని చెప్పి, అక్కడ వాళ్ళు తన కడుపున పుట్టేటట్లు, వాళ్ళు ఒక్కొక్కరూ పుట్టిన వెంటనే శాపవిమోచనం కలిగించేట్లు అనుగ్రహిస్తుంది. అలా అటు అష్టవసువుల శాపవిమోచనం జరగడంతో బాటు ఇటు శంతనుడికి ఒక వారసుడు మిగులుతాడు. అతడే భీష్ముడు. (శాపవశాన మానవజన్మెత్తిన శంతనుడికి పూర్వజన్మస్మృతి లేదు. కానీ తనంతట తాను భూలోకానికి వచ్చిన గంగకు మాత్రం గతంలో జరిగిన విషయాలన్నీ చక్కగా జ్ఞాపకమున్నాయి.) తర్వాత జరిగిన కథ అందరికీ తెలిసిందే !

Labels:

posted by త్రివిక్రమ్ Trivikram, 6:36 PM | link | 2 comments |

లోపాముద్ర

Monday, March 12, 2007

మన పురాణాల్లో ఉన్న లోపాముద్రల కథలు:
1. ఈమెకు కౌశీతకి అని, వరప్రద అని పేర్లున్నాయి. రుగ్వేదంలో కూడా ఈమె ప్రస్తావన ఉంది. అగస్త్య మహామునికి ఈమె భార్య. అగస్త్యుడు ఒకసారి ఒక బావిలో తలకిందులుగా వేలాడే తన పితృదేవతలను చూశాడు. వాళ్ళు అతడి కారణంగానే తామలా ఉన్నామని, అతడు పెళ్ళి చేసుకుని కొడుకును కనేంత వరకు తమకు ఉత్తమగతులు కలగవని చెప్పారు. అప్పుడతను పెళ్ళి చేసుకోదలచి తనకు భార్య కావలసిన స్త్రీని సృష్టించడం కోసం లేడి నుంచి కన్నులు,... ఇలా సృష్టిలోని ఉత్కృష్టమైన అందాలన్నిటినీ పోగుచేశాడు. ఆమె కోసం తమ అవయవాలనిచ్చిన జీవుల శరీరాల్లో ఆ లోపాలు ముద్రలుగా మిగిలిపోయాయి. అందుకే ఆమె పేరు లోపాముద్ర ఐంది. అగస్త్యుడు విదర్భరాజు సంతానం కోసం చేసే యాగానికి వెళ్ళి లోపాముద్రను విదర్భరాణి గర్భంలో ప్రవేశపెట్టాడు. లోపాముద్ర అపురూప లావణ్యవతి (డిజైనర్ బేబీ కద?). అగస్త్యుడు ఆమెకు యుక్తవయసు వచ్చాక వెళ్ళి ఆమెను పెళ్ళాడగోరాడు. ఆమె తల్లిదండ్రులు మొదట ఒప్పుకోలేదు. కానీ ఆమే స్వయంగా అగస్త్యుణ్ణి వరించి పెళ్ళాడి ఆయనతోబాటే నిరలంకారంగా ఆశ్రమంలో ఉంటుంది. అగస్త్యుడు పెళ్ళిచేసుకున్నాడేగానీ కొడుకును కనాలన్న విషయం మర్చిపోయి మళ్ళీ యథాప్రకారం తన జపతపాల్లో పడిపోయాడు. ఒకసారి ఆమె స్నానం చేసి వస్తూఉండగా చూసి మర్చిపోయిన విషయం గుర్తొచ్చి నాలిక్కరచుకున్నాడు. ఐతే సంతానవతి కావడానికి ఆమె ఒక కోరిక కోరింది. "మీ దినచర్యలో ఒక ఋషిపత్నిగా నేను పాలు పంచుకుంటున్నాను. కానీ శృంగారం విషయంలో నేనొక రాకుమారిని. యువరాణికి తగిన ఆభరణాలు, రాజోచితమైన పాన్పు ఉంటేనే తప్ప వీలుపడదు." అని చెప్పేసింది. అగస్త్యుడు తన దగ్గర ధనం లేదనేసరికి తనకున్న ఆధ్యాత్మికశక్తులను వినియోగించమని సలహా ఇచ్చింది. అగస్త్యుడు ఆమెను సంతోషపెట్టడానికి శ్రుతర్వరాజును ఆభరణాలు అడిగాడు కానీ వాటిని తీసుకోవడానికి ఒక అసాధారణ నియమం విధించాడు. దాంతో ఆ రాజు ఆయన్ను ముందు వ్రధ్నాశ్వుడనే రాజు వద్దకు, తర్వాత త్రసదస్యుడనే రాజు దగ్గరకు తీసుకుపోయాడు. ఆ త్రసదస్యుడు అగస్త్యుడికి ఇల్వలుడనే వాణ్ణి గురించి చెప్పాడు. అగస్త్యుడు ఇల్వలుడి ఆతిథ్యాన్ని స్వీకరించి అతడి తమ్ముడైన వాతాపిని జీర్ణం చేసుకుని ధనరాశులను తీసుకుని వచ్చి లోపాముద్రను సంతోషపెట్టాడు. ఆమె ఏడేళ్ళు గర్భం ధరించి గుణవంతుడైన కొడుకును కంది. అతనే ధృఢాశ్వుడు లేక ఇధ్మవహుడు. భర్తతో కలిసి ఆమె లలితసహస్రనామ ప్రాశస్త్యాన్ని చాటింది.

2. దధీచి భార్య. ఈమె గర్భవతిగా ఉండగా ఆయన దేవతలకు ఆయుధాలివ్వడానికి అగ్నికి ఆహుతయ్యాడు. ఆమె కూడా చితిప్రవేశం చేయబోయి, గర్భస్థ శిశువు కోసం ఆగిపోయింది. ఒక పిప్పల వృక్షం కింద శిశువును ప్రసవించి చితిప్రవేశం చేసింది. అతడే పిప్పలాదుడు. ఈమె మరోపేరు సువర్చ.

3. కవేరుడనే ఋషిపుత్రిగా విష్ణుమాయ పుట్టింది. ఆమె తపస్సు చేసి ఒక అంశ లోపాముద్రగా, మరో అంశ కావేరి నదిగా రూపొందింది.

4. పూర్వజన్మలో ఒక బ్రాహ్మణుడు. త్రిపురసుందరి అనుగ్రహం వల్ల పురుషత్వం పోయి దేవిరూపం గల స్త్రీగా మారాడు. అగస్త్యుడు ఆమెను కోరాడు. ఆమె దేవిని ఉపాసించమంది. హయగ్రీవుడి కృప వల్ల అగస్త్యుడు త్రింశతి, శ్రీవిద్యల ఉపదేశం పొందాడు.

Labels: ,

posted by త్రివిక్రమ్ Trivikram, 9:20 AM | link | 1 comments |

కర్ణుడి తొడను తొలచిన కీటకం ఎవరబ్బా?

Friday, March 2, 2007

పరశురాముడు కర్ణుడి తొడ మీద నిద్ర పోతుండగా ఒక కీటకం అతడి తొడని తొలవటం తెలిసిందే కదా? కర్ణుడికి వున్న సవాలక్ష శాపాలలో ఒకటి దాని వలన వచ్చినదే. పరశురాముడు క్షత్రియ విద్వేషి. అందువలన అతడు క్షత్రియులకు విద్య నేర్పడు.బ్రాహ్మణులకు మాత్రమే నేర్పుతాడు. కానీ కర్ణుడు తను బ్రాహ్మణ పుత్రుడని చెప్పుకోవడంతో అతనికి నేర్పాడు.

అది అలా వుంచితేఈ పురుగు పేరు "అలర్కము". ఇది తొలవటం వలన కారిన రక్తం తగిలి, పరశురాముడు లేచి ఆ పురుగును గమనించాడు. వెంటనే ఆ పురుగుకు శాప విమోచనం కలిగి త్రాగ్దంశుడు అనే దనుజుడిగా మారి మరణించాడు.

ఆ వెంబడనే, కర్ణుడు తప్పని సరిగా క్షత్రియుడై వుంటాడని, బ్రాహ్మణుడికి ఇలా నిబ్బరంగా బాధను భరించడం రాదని నిర్ధారించుకుని అతనికి నేర్పిన బ్రహ్మాస్త్రం మొదలైనవి ఏవీ అవసర సమయంలో పనికిరావు అని శాపమిచ్చాడు. కర్ణుడి చావుకున్న సవాలక్ష కారణాలలో ఇదొకటి...

Labels: , , ,

posted by Sudhakar, 12:39 AM | link | 2 comments |