బూరుగు గర్వభంగం
Thursday, May 1, 2008
బలవంతులతో దుర్భలులెప్పుడూ పోటీపడకూడదు. పెద్ద రాయి కింద చెయ్యి పెట్టకూడదని అనుభవజ్ఞులు చెబుతుంటారు.
హిమవత్ పర్వతం మీద ఒక పెద్ద బూరుగు వృక్షం ఉండేది. ఓసారి నారద మహర్షి ఆ దారిన వెడుతూ మధ్యలో బూరుగు దగ్గర ఒక క్షణం ఆగి " బూరుగా! ఈ హిమవత్ పర్వతం మీద నీ అంత పొడుగూ, వైశాల్యం కలిగిన చెట్టు మరేది లేదు. ఎన్నో పక్షులు నిన్ను ఆశ్రయించి జీవిస్తున్నాయి. గాలికి అన్ని చెట్లూ కూలిపోతాయి కాని నువ్వు మాత్రం చెక్కు చెదరకుండా నిలబడతావు. వాయుదేవుడు నీకు చుట్టమా. అతడు నిన్ను దయ తలచి రక్షిస్తున్నాడా" అని అడిగాడు.
బూరుగు వృక్షం ఆ మాటలకు పొంగిపోయింది.
"మునీంద్రా ! నా ముందు వాయుదేవుడెంత? అతని బలం నా బలంలో పదో వంతు కూడా రాదు" అంది గర్వంగా.
దేవర్షి చిన్నగా నవ్వి, " అంత మాటనకు. వాయుదేవుడు తలుచుకున్నాడంటే కొండలే కూలిపోతాయి. తెలుసా?" అన్నాడు.
"అదేమో నాకు తెలీదు. నా మొదలూ, కొమ్మలు చూసావా ఎంత బలంగా ఉన్నాయో . నన్ను తాకితే అతనికున్న ప్రభంజనుడనే బిరుదు కాస్తా పోతుంది." అంది బూరుగు.
"సరే, నీ ఇష్టం. వస్తా" అంటూ చిరునవ్వు నవ్వి వెళ్ళిపోయాడు నారదుడు. సంగతంతా చిటికలొ వాయుదేవుడికి అందించేసాడు.
వాయుదేవుడు బూరుగు చెట్టు దగ్గరకు వెళ్ళి " ఏమే బూరుగా! ఏం వాగావు. నీకు నాకంటే ఎక్కువ బలం ఉందా.నేను నిన్ను ఏమీ చేయలేనా. మాటలెందుకు. కాచుకో" అన్నాడు కోపంగా.
"తేలిగ్గా మాట్లాడకు. లోకంలో ఉన్న వృక్షాలతో నేను సమానం కాను " అంది శాల్మలి.
"ఓహో! ఎంత గర్వం? ఐతే నువ్వు అన్ని వృక్షాలకంటే గొప్పదానివని విర్రవీగకు. బ్రహ్మదేవుడు నీ నీడలో నిలబడ్డాడన్న గౌరవం కొద్దీ నిన్ను ఏం చెయ్యకుండా ఇన్నాళ్ళూ వదిలేశాను. అందుకే ఇప్పుడిలా పొగరెక్కి మాట్లాడుతున్నావు. ఐతే సరే రేపు బలాబలాలు తేల్చుకుందాం" అని వెళ్ళిపోయాడు.
వాయుదేవుడు వెళ్ళిపోయాక బూరుగు వృక్షానికి భయం పట్టుకుంది. "అయ్యో, మహాబలుడైన వాయుదేవుడితొ ఎరగక విరోధం పెట్టుకున్నాను. రేపు నా గతేమిటి.నారదమహర్షి మాటలు వినకపోయాను కదా" అని విచారించింది.
మరుక్షణం కాస్త ధైర్యం తెచ్చుకుంది." "వాయుదేవుడొస్తే ఏం చేస్తాడు. ఆకులు రాల్చేస్తాడు. కొమ్మలు, రెమ్మలు విరిచేస్తాడు! . ఆ పని నేనే చేసుకుంటే ఇంక అతనేం చేయగలడు. అతను ఓడిపోయినట్టేగా!" అనుకుని బలాన్న్నంతా కూడగట్టుకుని తనకు తానే ఆకులు విదిలించుకుని, కొమ్మలన్నింటిని విరుచుకుని మోడై నిలబడింది.
తెల్లవారింది.
భయంకరంగా ధ్వని చేస్తూ వాయుదేవుడు వచ్చాడు. ఆకులు, కొమ్మలు లేక దుంగలా మిగిలిన బూరుగును చూస్తునే పెద్దగా నవ్వుతూ, "నా పని నువ్వే చేసేశావే! మంచిది. ఇకనైనా బుద్ధి తెచ్చుకో! ఒళ్ళు దగ్గరపెట్టుకుని అతిగా గర్వముతో విర్రవీగకుండా బతుకు." అని హేళన చేసి వెళ్ళిపోయాడు.
శాల్మలి సిగ్గుతో తలవంచుకుంది.
Labels: బ
1 Comments:

ఏది ఏమైనా, ఒక తియ్యనైన పదాన్ని విన్నానన్న సంతోషం (కొంత కాలం) మిగిల్చిన మీకు మనస్పూర్తిగా ధన్యవాదములు. మీరు ఇలాగే పది కాలాల పాటు పాటు పడాలని నా కోరిక.
మీ వర్ణన ప్రశంసనీయం.
ఇట్లు
భవదీయుడు,
PS: ప్రశంసనీయం అనే పదానికి పర్యాయ పదాలేమైనా ఉంటే తెలియజేయగలరు.