<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://draft.blogger.com/navbar.g?targetBlogID\x3d1254698467234035774\x26blogName\x3d%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82\x26publishMode\x3dPUBLISH_MODE_BLOGSPOT\x26navbarType\x3dTAN\x26layoutType\x3dCLASSIC\x26searchRoot\x3dhttps://jagannaatakam.blogspot.com/search\x26blogLocale\x3den_US\x26v\x3d2\x26homepageUrl\x3dhttp://jagannaatakam.blogspot.com/\x26vt\x3d-5619112905543282348', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

స్ఫూర్తి - సమయస్ఫూర్తి

Saturday, May 19, 2007

నడి ఎండాకాలం. సూర్యుడు అగ్నిగోళంలా ఉన్నాడు. నిప్పులు చెరిగి పోస్తున్నాడు. "చెరువులూ, మడుగులూ కాగి ఇంకిపోతున్నాయి. చూశారా! మడుగు ఎండిపోతోంది! ఈ కాసిని నీళ్ళు కూడా ఇంకిపోతే ఇంకో చోటికి వెళ్ళటానికి కూడా సాధ్యం కాదు. కనుక ఎప్పుడూ ఇంకని నీళ్ళు గల మడుగుకు ఇప్పుడే తరలిపోదాం" అన్నాడు దీర్ఘదర్శి. "నీకన్నీ భయాలే వూరుకుందూ! అంతగా నీళ్ళింకిపోతే అప్పుడు చూసుకుందాంలే. అప్పటికి ఎదో ఒక ఉపాయం తట్టకపోదు" అన్నాడు ప్రాప్తకాలజ్ఞుడు."బాగా చెప్పావు. దీర్ఘదర్శి ఎపుడూ ఇంతే. ఊరికే కంగారుపడిపోతాడు". అన్నాడు దీర్ఘసూత్రుడు.

దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు ముగ్గురూ స్నేహితులు. అరణ్యంలో ఉన్న ఆ మడుగులో ఎంతో కాలంగా కలసి మెలసి వుంటున్న చేపలు. స్నేహితులు కదా అని హితవు చెప్పాడు దీర్ఘదర్శి. వినకపోతే తానేం చేస్తాడు? ఎండలు రాను రాను ముదురుతున్నాయి. ఇవాళ కాకపోతే రేపైనా ఈ మడుగు ఎండుతుంది. నీళ్ళింకితే జాలర్లు చేపల్ని బ్రతకనిస్తారా? అప్పటికప్పుడు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని తొక్కిసలాడేకంటే ముందే జాగ్రత్తపడటం మంచిది కదా అని దీర్ఘదర్శి దూరాలోచన చేశాడు. మిత్రులు ఒపుకోవడం లేదాయె!

"సరే! అయితే మీరు మీ ఇష్టం వచ్చినట్టు వుండండి. నేను పోతున్నా" అని ఆ చేప మెల్లమెల్లగా వెళ్ళి ఒక పెడ్డ మడుగులో ప్రవేశించింది. మిగిలిన వాళ్ళిద్దరూ ఇదివరకు ఉన్న మడుగులోనే వున్నారు. దీర్ఘదర్శి చెప్పినట్టు కొన్నాళ్ళకు ఆ మడుగులో నీళ్ళింకిపోయాయి. చేపలు పట్టేవాళ్ళు వలలు చేత పట్టుకుని రానే వచ్చారు."అయ్యయ్యో! ఎంత ప్రమాదం వచ్చింది. ఈ జాలర్లు ఊతలతోనూ, వలతోనే కాకుండా చేతుల్తో కూడా పట్టేస్తున్నారు. తాళ్ళకి గుచ్చుతున్నారు. ఏం చేద్దాంరా మిత్రమా?" అంటూ ప్రాప్తకాలజ్ఞుడు ఏడుపు ముఖం పెట్టాడు.

"ఏమోరా! దీర్ఘదర్శి మాటలు విన్నాం కాదు మనం. నాకేం దిక్కు తోచడం లేదు" అంటూ అటూ ఇటూ ఖంగారుగా ఎగిరెగిరి పడటం మొదలుపెట్టాడు దీర్ఘసూత్రుడు. ఈ చేప అలా ఎగరటం ఒక బెస్తవాడు చూడనే చూశాడు. దానిని రెండు చేతులతో పట్టుకుని చంపి తాడుకు గుచ్చేశాడు. అది చూసి గుండె ఆగినట్టైంది ప్రాప్తకాలజ్ఞుడికి. ఆలోచించి చివరకు ఒక ఉపాయం పన్నాడు.

చేపలు గుచ్చిన తాడు దగ్గరకు మెల్లగా వెళ్ళి ఆ తాడును రెండు దవడలతోను కరచి పట్టుకుని చచ్చినట్టు పడి వున్నాడు.వేట పూర్తయ్యాక చేపలకున్న బురదనంతా కడగటానికని వాటిని జాలర్లు ఒక మంచినీళ్ళ మడుగులో ముంచారు. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు ఆ తాడు విడిచి నీళ్ళలోకి జారుకున్నాడు. బ్రతుకుజీవుడా అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.

కాబట్టి అటు దూరదృష్టి, ఇటు సమయస్ఫూర్థి రెండూ లేనివాడు దీర్ఘసూత్రుడిలాగే ప్రాణం పోగొట్టుకుంటాడు. అప్పటికప్పుడు పథకం వేసుకుని నడిచేవాడు ప్రాప్తకాలజ్ఞుడి లాగే పరమ సంశయభరితమైన జీవితం గడుపుతాడు. రాబోయే వాటిని ముందే ఊహించి తగినట్టు జాగ్రత్తపడేవాడు దీర్ఘదర్శిలాగా సుఖపడతాడు.

Labels:

posted by జ్యోతి, 3:53 PM