<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://www.blogger.com/navbar.g?targetBlogID\x3d1254698467234035774\x26blogName\x3d%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82\x26publishMode\x3dPUBLISH_MODE_BLOGSPOT\x26navbarType\x3dTAN\x26layoutType\x3dCLASSIC\x26searchRoot\x3dhttps://jagannaatakam.blogspot.com/search\x26blogLocale\x3den_US\x26v\x3d2\x26homepageUrl\x3dhttp://jagannaatakam.blogspot.com/\x26vt\x3d-5619112905543282348', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

సుందోప సుందులు

Friday, December 14, 2007

హిరణ్యకశిపుని వంశంలో నికుంభుడనే రాజుగారికి ఇద్దరు పిల్లలు కలిగారు. వారే సుందోపసుందులు. అల్లరిలో ఒకరికొకరు తీసిపోరు రాజుగారి పిల్లలు కనుక గారాబంగా పెరిగారు. ఇద్దరూ ఎంతో అన్యోన్యంగ ఉండేవాళ్ళు, ఒక్క క్షణం కూడ ఒకరిని విడిచి ఒకరుండేవారు కాదు. వారికి చిన్నప్పుడే ప్రపంచమంతా జయించాలన్న కోరిక కలిగింది. త్రిలోకాల్లో ఉన్న దేవతలు, మునులు, చక్రవర్తులు, యోధులు అందరినీ కేవలం భుజబలం తో ఓడించలేమని నార వస్త్రాలు కట్టి వింధ్య పర్వతం మీద తపస్సు చేసారు. ఆ తపస్సు నుండి పుట్టిన వేడికి భయపడ్డ దేవతలు ఎన్నో విఘ్నాలు కలిగించారు, నచ్చ చెప్పారు. అయినా సుందోపసుందులు వినలేదు.

ప్రకృతే వారి తపోదీక్షకు స్తంభించిపోయింది. లోకాలన్నీ అల్లకల్లోలమయ్యాయి. దేవతలంతా కలిసి బ్రహ్మ దగ్గరకు పరిగెత్తి వారి తపస్సును ఆపమని వేడుకున్నారు. అంతట ఆ బ్రహ్మ సుందోపసుందుల ఎదుట ప్రత్యక్షమై వారి కోరికలేమిటో అడిగాడు. అంతట వారు నమస్కరించి " స్వామీ ! ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళగలిగే కామగమన విద్యనూ, ఏ రూపం కావాలంటే ఆ రూపం పొందగలిగే కామరూప విద్యనూ, సకల మాయా ప్రదర్శన శక్తిని అనుగ్రహించండి. ఎవరివల్లా మాకు చావు లేకుండా అమరత్వాన్ని ప్రసాదించండి " అని వేడుకున్నారు. " అమరత్వమా ! అది కుదరని పని . అయితే ఎవరి వల్లా మీకు చావు రాదు. మీవల్ల మీరే మరణిస్తారు. " అన్నాడు బ్రహ్మ.

అంతట ఆ సుందోపసుందులు విజృంభించిపోయారు. అసలే రాజుగారి పిల్లలవటం చేత వచ్చిన అతిశయం, బ్రహ్మదేవుని వరాలు కలిసి తోక తెగిన కోతుల్లా లోకాల మీద పడ్డారు. జపతపాలు ఆగిపోయాయి. యజ్ఞయాగాదులు నిలిచిపోయాయి. మున్యాశ్రమాల మీదకు మదపుటేనుగుల్లా, తోడేళ్ళలా, సింహాల్లా కామరూపాలతో దాడి చేసేవారు. ప్రపంచంతా అల్లకల్లోలమైంది. వారి హింసాకాండను భరించలేక దేవ గాంధార్వ సిద్ధ గణాలు బ్రహ్మను ప్రార్ధించగా.. విశ్వకర్మను పిలిచి "నీ ప్రతిభనంతా ఉపయోగించి అతిలోక సౌందర్యరాశిని సృష్టించాలి. " అన్నాడు.

ఆయన అలాగే శ్రమించి ఒక సౌందర్యరాశిని సృష్టించాడు. బ్రహ్మ ఆమెకు ప్రాణం పోశాడు. ఆ అందాల భామ తిలోత్తమ అందానికి, శరీర లావణ్యానికి అందరూ అబ్బురపడ్డారు. బ్రహ్మ ఆమెని పిలిచి " నీ మూలంగా సుందోపసుందుల మధ్య విరోధం రావాలి. ఆ కోపంలో ఇద్దరూ ఒకరినొకరు చంపుకోవాలి. వాళ్లిద్దరికీ అన్ని మాయలు తెలుసు. అంతకు మించిన మాయలు చూపాలి నీవు " అన్నాడూ. అంత తిలోత్తమ బ్రహ్మా ఆదేశానుసారం వెళ్ళి సుందోపసుందుల కంటపడేలా సంచరించింది. "ఈమె నా ప్రాణం" అని అన్నగారంటే, " ఈ అతిలోక సుందరి నా భార్య, నీకు మరదలవుతుంది. దూరంగా ఉండు" అని ఉపసుందుడన్నాడు. ఒకరు కుడిచేతిని, ఒకరు ఎడమచేతిని పట్టుకున్నారు.

అంతే. అంతవరకూ పరస్పర వాత్సల్యంతో ఉన్న ఆ అన్నదమ్ములిద్దరూ పిడిగుద్దులు గుద్దుకున్నారు. ఆమె తనకు దక్కాలంటే తనకు దక్కాలని ఘోరంగా పోట్లాడుకున్నారు. చివరికి ఒకరికొకరు పొడుచుకుని రక్తం కక్కుకుని నేలకూలారు. అది విని ముల్లోకాలు పండగ చేసుకున్నారు. ఒకరిని విడిచి ఒకరు ఉండలేని అన్నదమ్ములు మధ్య మోహం కలహానికి కారణమై వారి పతనానికి దారి తీస్తుంది ..

Labels:

posted by జ్యోతి, 10:45 AM | link | 1 comments |