<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://www.blogger.com/navbar.g?targetBlogID\x3d1254698467234035774\x26blogName\x3d%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82\x26publishMode\x3dPUBLISH_MODE_BLOGSPOT\x26navbarType\x3dTAN\x26layoutType\x3dCLASSIC\x26searchRoot\x3dhttps://jagannaatakam.blogspot.com/search\x26blogLocale\x3den_US\x26v\x3d2\x26homepageUrl\x3dhttp://jagannaatakam.blogspot.com/\x26vt\x3d-5619112905543282348', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

స్ఫూర్తి - సమయస్ఫూర్తి

Saturday, May 19, 2007

నడి ఎండాకాలం. సూర్యుడు అగ్నిగోళంలా ఉన్నాడు. నిప్పులు చెరిగి పోస్తున్నాడు. "చెరువులూ, మడుగులూ కాగి ఇంకిపోతున్నాయి. చూశారా! మడుగు ఎండిపోతోంది! ఈ కాసిని నీళ్ళు కూడా ఇంకిపోతే ఇంకో చోటికి వెళ్ళటానికి కూడా సాధ్యం కాదు. కనుక ఎప్పుడూ ఇంకని నీళ్ళు గల మడుగుకు ఇప్పుడే తరలిపోదాం" అన్నాడు దీర్ఘదర్శి. "నీకన్నీ భయాలే వూరుకుందూ! అంతగా నీళ్ళింకిపోతే అప్పుడు చూసుకుందాంలే. అప్పటికి ఎదో ఒక ఉపాయం తట్టకపోదు" అన్నాడు ప్రాప్తకాలజ్ఞుడు."బాగా చెప్పావు. దీర్ఘదర్శి ఎపుడూ ఇంతే. ఊరికే కంగారుపడిపోతాడు". అన్నాడు దీర్ఘసూత్రుడు.

దీర్ఘదర్శి, ప్రాప్తకాలజ్ఞుడు, దీర్ఘసూత్రుడు ముగ్గురూ స్నేహితులు. అరణ్యంలో ఉన్న ఆ మడుగులో ఎంతో కాలంగా కలసి మెలసి వుంటున్న చేపలు. స్నేహితులు కదా అని హితవు చెప్పాడు దీర్ఘదర్శి. వినకపోతే తానేం చేస్తాడు? ఎండలు రాను రాను ముదురుతున్నాయి. ఇవాళ కాకపోతే రేపైనా ఈ మడుగు ఎండుతుంది. నీళ్ళింకితే జాలర్లు చేపల్ని బ్రతకనిస్తారా? అప్పటికప్పుడు ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని తొక్కిసలాడేకంటే ముందే జాగ్రత్తపడటం మంచిది కదా అని దీర్ఘదర్శి దూరాలోచన చేశాడు. మిత్రులు ఒపుకోవడం లేదాయె!

"సరే! అయితే మీరు మీ ఇష్టం వచ్చినట్టు వుండండి. నేను పోతున్నా" అని ఆ చేప మెల్లమెల్లగా వెళ్ళి ఒక పెడ్డ మడుగులో ప్రవేశించింది. మిగిలిన వాళ్ళిద్దరూ ఇదివరకు ఉన్న మడుగులోనే వున్నారు. దీర్ఘదర్శి చెప్పినట్టు కొన్నాళ్ళకు ఆ మడుగులో నీళ్ళింకిపోయాయి. చేపలు పట్టేవాళ్ళు వలలు చేత పట్టుకుని రానే వచ్చారు."అయ్యయ్యో! ఎంత ప్రమాదం వచ్చింది. ఈ జాలర్లు ఊతలతోనూ, వలతోనే కాకుండా చేతుల్తో కూడా పట్టేస్తున్నారు. తాళ్ళకి గుచ్చుతున్నారు. ఏం చేద్దాంరా మిత్రమా?" అంటూ ప్రాప్తకాలజ్ఞుడు ఏడుపు ముఖం పెట్టాడు.

"ఏమోరా! దీర్ఘదర్శి మాటలు విన్నాం కాదు మనం. నాకేం దిక్కు తోచడం లేదు" అంటూ అటూ ఇటూ ఖంగారుగా ఎగిరెగిరి పడటం మొదలుపెట్టాడు దీర్ఘసూత్రుడు. ఈ చేప అలా ఎగరటం ఒక బెస్తవాడు చూడనే చూశాడు. దానిని రెండు చేతులతో పట్టుకుని చంపి తాడుకు గుచ్చేశాడు. అది చూసి గుండె ఆగినట్టైంది ప్రాప్తకాలజ్ఞుడికి. ఆలోచించి చివరకు ఒక ఉపాయం పన్నాడు.

చేపలు గుచ్చిన తాడు దగ్గరకు మెల్లగా వెళ్ళి ఆ తాడును రెండు దవడలతోను కరచి పట్టుకుని చచ్చినట్టు పడి వున్నాడు.వేట పూర్తయ్యాక చేపలకున్న బురదనంతా కడగటానికని వాటిని జాలర్లు ఒక మంచినీళ్ళ మడుగులో ముంచారు. అప్పుడు ప్రాప్తకాలజ్ఞుడు ఆ తాడు విడిచి నీళ్ళలోకి జారుకున్నాడు. బ్రతుకుజీవుడా అనుకుని ఊపిరి పీల్చుకున్నాడు.

కాబట్టి అటు దూరదృష్టి, ఇటు సమయస్ఫూర్థి రెండూ లేనివాడు దీర్ఘసూత్రుడిలాగే ప్రాణం పోగొట్టుకుంటాడు. అప్పటికప్పుడు పథకం వేసుకుని నడిచేవాడు ప్రాప్తకాలజ్ఞుడి లాగే పరమ సంశయభరితమైన జీవితం గడుపుతాడు. రాబోయే వాటిని ముందే ఊహించి తగినట్టు జాగ్రత్తపడేవాడు దీర్ఘదర్శిలాగా సుఖపడతాడు.

Labels:

posted by జ్యోతి, 3:53 PM | link

నారదుని పూర్వజన్మ వృత్తాంతం

Tuesday, May 8, 2007

నారదుడు పూర్వజన్మలో ఒక దాసీపుత్రుడు. బాల్యదశలోనే (అయిదేళ్ళ వయస్సు)వర్షశరదృతువుల్లో చాతుర్మాస్య దీక్ష తీసుకున్న వేదవేత్తలయిన మునుల సేవ కోసం అతని తల్లి నియోగించింది.ఆ బాలుడు బాల్య చాపల్యం లేకుండా, ఆటపాటల జోలికి పోకుండా, మితభాషియై, అన్నన్య చిత్తముతో సేవించాడు. వారు తినగా మిగిలిన పదార్థాలను భుజించాడు. వారు ప్రతి నిత్యమూ గానం చేసే శ్రీకృష్ణ కధామృతాన్ని మూడు పూటలా ఆస్వాదించాడు. దయాసముద్రులైన ఆ మునుల కాటాక్షం చేతనూ, శ్రీకృష్ణ కథాశ్రవణమ్ చేతనూ అతనిలో నిశ్చలమైన కృష్ణభక్తి ఏర్పడింది. పాపాలు నశించాయి.


అజ్ఞానం తొలగిపోయింది. అతనిలోని సత్వ రజస్తమొ గుణాలు అంతరించాయి. దీక్షానంతరం మునులు వెళ్లిపోతూ సాక్షాత్తు భగవంతుని చేత ఉపదేశించబడిన దివ్యజ్ఞానాన్ని అతనికి ఉపదేశించారు. ఆ ఉపదేశాన్ని అనుష్ఠించడం వల్ల శ్రీకృష్ణుని మాయా ప్రభావాన్ని చక్కగా తెలుసుకున్నాడు. ఆ మునులు వెళ్ళిపోయిన తర్వాత అతడు తల్లి సంరక్షణలోనే ఉంటూ ఆమె పనిచేసే బ్రహ్మణుల ఇళ్ళలో నివసించేవాదు. ఒక రోజు రాత్రిపూట అతని తల్లి పాముకాటుకు బలై మరణించింది. ఆ సంఘటనను ఈశ్వర సంకల్పంగా భావించి, నిర్వికారంగా ఉత్తర దిశగా ప్రయాణమై వెళ్ళాడు. జనపదాలు, నగరాలు, గ్రామాలు, వనాలు, పర్వతాలు, సరస్సులు దాటి ఒక భయంకరమైన అడవిలోకి ప్రవేశించాడు. సుదీర్ఘ ప్రయాణం వల్ల అలసట చెందిన అతడు ఒక నదిలో హాయిగా స్నానం చేసి ఆ నదీజలాన్ని పానం చేసి దాహం తీర్చుకొన్నాడు.


నిర్మానుష్యమైన అడవిలో ఒక రావిచెట్టు కింద కూర్చుని భగవంతుని పాదపద్మాలను ధ్యానం చేయడం మొదలుపెట్టాడు. కొంతసేపటికి శ్రీహరి ఆని హృదయంలో లీలగా గోచరించాడు.అతని మనస్సు ఆనందంతో నిండిపోయింది. శరీరం పులకించింది. ఆ ఆనందమగ్న స్తితిలో తన్ను తానుగానీ, ఆ భగవనుడినిగానీ చూడలేకపోయాడు.(ఇది ధ్యాత్పధ్యేయ భేదరహితమైన స్థితి). ఆ వెంటనే భగవద్రూపం అదృశ్యమైంది. ఇష్ట వస్తువును కోల్పోయినట్టుగా అతడి మనసు కలత చెందింది. మళ్ళీ ఏకాగ్ర చిత్తంతో ధ్యానించినా ఆ రూపం కనపడలేదు. బాధతో కుమిలిపోతుండగా మధుర గంభీర స్వరముతో శ్రీహరి మాటలు వినపడ్డాయి."నాయనా! ఈ జన్మలో నా దర్శనం లభించే అర్హత నీకింకా కలగలేదు. కోర్కెలన్నింటినీ పూర్తిగా జయించని సాధకులు నా దర్కనభాగ్యం పొందలేరు. నీకు నాయందున్న అనురక్తిని వృద్ధి చెయ్యాలనే సంకల్పంతోనే నీకు క్షణకాలం నా రూపదర్శనమిచ్చాను.దాని ద్వారా నీ భక్తి దృడమవుతుంది. ఈ దేహాన్ని విడిచిన పిమ్మట నువ్వు నా అనుచరుడివవుతావు. ప్రళయ సమయంలో సైతం నీకు నా అనుగరహం వల్ల పూర్వ స్మృతి లభిస్తుంది"


అంతట నారదుడు ఆ శ్రీహరి నామాన్నే స్మరిస్తూ, ఆయన లీలావిశేషాలు కీర్తిస్తూ, ఏ కోరికలు లేనివాడై, వినమ్రుడై భూలోకమంతా పర్యటించాడు. అలా పర్యటిస్తూ ఉండగా అతడి ప్రారబ్ద కాలం పూర్తయ్యింది. శరీరం పతనమైంది. ఆ తరువాత కల్పాంతంలో మహావిష్ణువు సమస్త ప్రపంచాన్ని ఉపసమ్హరించి మహా సముద్రం మధ్య నిద్రిస్తూ ఉండగా ఆయనలో నిద్రించడానికి ప్రవేశిస్తున్న బ్రహ్మదేవుని శ్వాసతో పాటు నారదుడు కూడా నారాయణుని ఉదరంలోనికి ప్రవేశించాడు. అలా సహస్తయుగాలు గడిచిపోయాయి. సృష్టి కార్యం కోసం బ్రహ్మ నిద్ర లేచాడు. అప్పుడు ఆయన శరీరం నుంచి అత్రి, మరీచి మొదలీన ఋషులతో పాటు నారదుడూ అవరరించాడు. అప్పటినుండి శ్రీమహావిష్ణువు అనుగ్రహంతో దేవదత్తమైన మహతి వీణను మీటుతూ హరికథాగానం చేస్తూ ముల్లోకాలలోనూ నిరాటంకంగా సంచరిస్తున్నాడు.
posted by జ్యోతి, 12:51 PM | link | 5 comments |

బంగారు ముంగిస

Wednesday, May 2, 2007

ధర్మరాజు వదిలిన యాగాశ్వం పార్ధుడి సంరక్షణలో సమస్త భూమండలాన్నీ దిగ్విజయంగా చుట్టి వచ్చింది. దక్షప్రజాపతి యాగవైభవాన్ని గుర్తు చేస్తూ ధర్మతనయుడు నిర్విఘ్నంగా అశ్వమేధయాగాన్ని ముగించాడు. వ్యాసమహాముని, దేవతలు, మునులు అజాతశత్రుణ్ణీ ఆశీర్వదించారు. ఋత్విజులకు ఒక్కొక్కరికి కోటివేల బంగారునాణాలను ఇచ్చి తన రాజ్యమంతటిని వేదవ్యాస మహామునికి దక్షిణగా సమర్పించాడు ధర్మరాజు.కాని ఆ ముని తనకు భూమి అక్కర్లేదు బంగారమిమ్మనెను. ఆ భూమికి వెలకట్టి బంగారం ఇచ్చి భూమిని ఉంచుకొమ్మనెను. అప్పుడు ధర్మజుడు " స్వామీ! అశ్వమేధయాగానికి భూమి దక్షిణ అంటారు. అందుకే మీకు దక్షిణగా ఇచ్చాను.అది తిరిగి తీసుకుంటానా" అనెను."కాని మేము అమ్ముతామంటే నువ్వు భూమిని కొనుక్కోవడంలో తప్పేముంది.ఇందులో ఏ దోషము లేదు తీసుకో" అనెను వ్యాసమహాముని.

అంత ధర్మరాజు కోటికోట్ల మాడలు కుప్పగా పోసి "ఇది నా భూమికి వెల" అని చెప్పి ఆ ధనాన్ని వ్యాసమహర్షికి అర్పించాడు.ఆయన అదంతా విప్రులకు, మిగతావాళ్ళకు పంచిపెట్టాడు. బంగారు పాత్రలు, యూపస్తంభాలు,వస్త్రాలు,తోరణాలను అందరికి పిలిచి పిలిచి దానం చేసాడు ధర్మరాజు. ఉపాధ్యాయుడు కానివాడు, వేదవేదాంగ నిరతుడు కానివాడు, వ్రతనిష్ఠలేనివాడు ఆ సదస్సులో లేనే లేరు. మునులందరూ ఆ యాగాన్ని మెచ్చుకున్నారు.సిద్ధులూ, విప్రులూ అక్షింతలు జల్లుతూ ఆశీర్వదించారు.

తన భాగానికి వచ్చిన బంగారమంతా కుంతీదేవికి ఇచ్చాడు వ్యాసుడు.యగ్ణానికి వచ్చిన రాజులందరికీ మణిభూషణాలు,ఏనుగులు, గుర్రాలు ఇచ్చాడు ధర్మరాజు. కృష్ణుణ్ణి విశేషంగా సత్కరించాడు. ఆనాడు ధర్మరాజు చేసిన దానాల వల్ల సమస్త ప్రజలూ తృప్తి పొందారు. అయితే అప్పుడొక చిత్రం జరిగింది.

ఒక కలుగులోంచి ఒక ముంగిస బయటికి వచ్చి "అబ్బ! ఎంత గొప్పగా పొగుడుతున్నారు! ఎంత దానం చేస్తే మాత్రం
మరీ అంతగా మెచ్చాలా? సక్తుప్రస్ఫుడు చేసిన ధర్మంలో ఏ వంతు ఈ అశ్వమేధయాగం?!" అంటూ మూతి విరిచింది.

అప్పుడు విప్రులు ’ఈ యాగంలో నీకేం లోటు కనిపించింది?’ అని ప్రశ్నించారు. "అయ్యా! ఆకలిని, తృష్ణను
జయించినవాడు సక్తుప్రస్ఫుడు. అతనొక బీద బ్రాహ్మణుడు. ఉంచవృత్తితో జీవించేవాడు. నా, నేను అన్న ప్రీతి త్యజించి
సంపూర్ణార్పణతో అతిథిపూజ చేసిన మహానుభావుడు. భక్తి, వినయం, శ్రద్ధ, ఓర్పు, కరుణ అతనియందు స్థిరంగా వున్నాయి. నెల్లాళ్ళుగా కరువు వల్ల కడుపునిండా తిండి లేక ఆకలితో అలమటిస్తూ ఒకసారి ఎవరి దయవల్లనో కుంచెడు పిండి తెచ్చుకున్నాడు. అతనూ, భార్యా, కొడుకూ, కోడలూ ఆవురావురంటూ తినడానికి కూర్చోబోతుండగా అనుకోకుండా ఒక అతిథి వచ్చాడు. ఆ అతిథికి వాళ్ళంతా సపర్యలు చేసి 'ఆరగించండి స్వామీ ' అంటూ తెచ్చుకున్న ఆ కాస్త పిండిని భక్తితో సమర్పించారు. నాటి అతని దాన దక్షతను దేవతలే స్తుతించారు. ధర్మదేవత సంతసించింది. బ్రహ్మదేవుడు మణీమయ విమానం పంపి సక్తుప్రస్ఫుణ్ణి స్వర్గలోకానికి పిలిపించుకున్నాడు.అదంతా చూశాక కలుగులోంచి బయటకు వచ్చాను నేను. ఆ సక్తుప్రస్ఫుడు తయారుచేసిన పిండి వాసనా, అతిథి కాళ్ళు కడిగిన నీళ్ళూ సోకి నా తలా శరీరంలో ఒక భాగమూ బంగారుమయమయ్యాయి. ఇదీ ఆ సక్తుప్రస్ఫుని ధర్మమహిమ!!

"మిగిలిన శరీరం కూడా బంగరుమయం చేసుకుందామని ఎన్ని యజ్ణప్రదే్శాలకో వెళ్ళాను. లాభం లేకపోయింది. సక్తుప్రస్ఫుడి దాననిరతికి దీటైన దయాశీలత నాకు ఇంతవరకు తారసపడలేదు. ఈనాడు అజాతశత్రుడు యాగంలో నైనా నా కోరిక తీరకపోతుందా అనుకున్నాను. కాని నా ఆశ నిరాశగానే మిగిలిపోయింది. అందుకే ధర్మరాజు యాగం సక్తుప్రస్ఫుడి ధర్మానికి సరిపోలదని అన్నాను" అని చెప్పి ఆ ముంగిస ఎవరికీ కనపడకుండా మాయమయింది.
posted by జ్యోతి, 12:36 PM | link | 4 comments |