<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://www.blogger.com/navbar.g?targetBlogID\x3d1254698467234035774\x26blogName\x3d%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82\x26publishMode\x3dPUBLISH_MODE_BLOGSPOT\x26navbarType\x3dTAN\x26layoutType\x3dCLASSIC\x26searchRoot\x3dhttps://jagannaatakam.blogspot.com/search\x26blogLocale\x3den_US\x26v\x3d2\x26homepageUrl\x3dhttp://jagannaatakam.blogspot.com/\x26vt\x3d-5619112905543282348', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

ఆకలి బాధ

Saturday, September 6, 2008

పూర్వం విదర్భ రాజ్యాన్ని సుదేవుడి కొడుకు శ్వేతుడు పాలించేవాడు. అతను గొప్ప తపస్సంపన్నుడు, జ్ఞానశీలి, ధర్మబద్ధంగా రాజ్యాన్ని పాలించి తపశ్శక్తితో దైవత్వాన్ని పొందాడు.

కొంతకాలానికి మరణించిన శ్వేతుడిని విష్ణుభక్తులు వచ్చి స్వర్గానికి తీసికెళ్ళారు. అక్కడ దేవకన్యలు సేవిస్తుంటే భోగభాగ్యాలు అనుభవిస్తూ సంతోషంగా ఉన్నాడు. కాని అన్ని సుఖాలున్నా శ్వేతుడు ఆకలిబాధతో బాధపడుతున్నాడు. స్వర్గంలో ఉండేవాళ్ళకు అస్సలు ఆకలి అనేది ఉండదు ఆకలివేస్తే తినడానికి కూడా ఏమి ఉండదు. కాని శ్వేతుడికి స్వర్గలోకంలో కూడా ఆకలిబాధ తప్పలేదు.

ఆ బాధ తట్టుకోలేక ఒక రోజు బ్రహ్మ దగ్గరకు వెళ్లాడు. "స్వామి! నేను గొప్ప తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గానికి వచ్చాను. కాని నాకు ఆకలి బాధ తప్పలేదు. స్వర్గంలో ఉన్న మిగతావారికి ఆకలి ఉండదు కాబట్టి ఇక్కడ తినడానికి ఏమీ దొరకడంలేదు. ఈ బాధ తప్పే ఉపాయం చెప్పండి " అని వేడుకున్నాడు.

అతని మాటలు విన్న బ్రహ్మ " మహారాజా! నువ్వు గొప్ప తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గలోకానికి వచ్చావు. కాని ఎవ్వరికీ లేని ఆకలిబాధ నీకు కలిగింది. దానికి కారణం చెప్తాను విను. నువ్వు ఎవరి ఆకలి బాధ తీర్చలేదు. ఎవరికి పట్టెడు అన్నం పెట్టలేదు. దాహమన్న వాళ్ళకి మంచినీళ్ళివ్వలేదు. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పది. అది నువ్వు చేయలేదు. అందుకే "ఆకలిబాధ" అంటే ఏమితో ఇప్పుడు నువ్వు తెలుసుకుంటున్నావు" అన్నాడు బ్రహ్మ.

"స్వామి ! మరి నా ఆకలిబాధ తీరే మార్గం లేదా?. నన్ను కాపాడండి." అని వేడుకున్నాడు శ్వేతుడు.

" శ్వేతా! నువ్వు భూలోకంలో నీ శవం ఎక్కడుందో వెతికి, అక్కడికి వెళ్ళి రోజూ కొంచెం కొంచెం తిని నీ ఆకలి బాధ తగ్గించుకో. నువ్వు ఎంత తిన్నా కూడా ఆ భాగం మళ్ళీ పెరుగుతుంది. అది ఎప్పటికి తరగదు" అన్నాడు బ్రహ్మ.

"స్వామీ! అలా నా శవాన్ని నేను ఎంతకాలం తినాలి?" అని అడిగాడు శ్వేతుడు.

"అగస్త్య మహర్షి నీ దగ్గరకు వచ్చి నిన్ను పలకరించేవరకు తింటూనే ఉండు. !" అన్నాడు బ్రహ్మదేవుడు.

బ్రహ్మ చెప్పినవిధంగా శ్వేతుడు రోజూ భూలోకం వెళ్ళి తన శవం ఎక్కడుందో వెతుక్కుని రోజూ తింటు ఆకలి తీరాక తిరిగి వస్తున్నాడు. మర్నాడు వెళ్ళేసరికి ఆ భాగం మళ్ళీ అలాగే ఉంటుంది. ఆ శవం కూడ కుళ్ళిపోకుండా, మనిషి పడుకున్నట్టే ఉంటుంది.

ఒకరోజు శ్వేతుడు ఆ శవాన్ని కోసుకుని తింటుండగా అగస్త్య మహర్షి చూసి ఆశ్చర్యపోయాడు. వెళ్ళి అతడిని పలకరించాడు. అప్పుడు " మహాత్మా! మిమ్మల్ని చూసిన నా జన్మ ధన్యమైనది. నా ఆకలి బాధ తీరింది. ఆకలిబాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవంతో తెలుసుకుని నేను చేసిన తప్పును అర్ధం చేసుకున్నాను" అని నమస్కరించి స్వర్గానికి వెళ్ళి సంతోషంగా ఉన్నాడు శ్వేతుడు.

దీని వలన మనకు తెలుసుకోవలసినదేమంటే ఆకలి అన్నవాళ్ళకి అన్నం పెట్టడం, దాహం అన్నవాళ్ళకి నీళ్ళివ్వడం ప్రతి మనిషి చేయవలసిన కనీస ధర్మం. అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పదని తెలుసుకోవడం మంచిది.

Labels:

posted by జ్యోతి, 5:22 PM | link | 1 comments |