<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://www.blogger.com/navbar.g?targetBlogID\x3d1254698467234035774\x26blogName\x3d%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82\x26publishMode\x3dPUBLISH_MODE_BLOGSPOT\x26navbarType\x3dTAN\x26layoutType\x3dCLASSIC\x26searchRoot\x3dhttps://jagannaatakam.blogspot.com/search\x26blogLocale\x3den_US\x26v\x3d2\x26homepageUrl\x3dhttp://jagannaatakam.blogspot.com/\x26vt\x3d-5619112905543282348', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

ఖాండవ వన దహనం

Monday, February 16, 2009

శ్వేతకి అనే రాజుగారు దుర్వాసమహర్షి పర్యవేక్షణలో సుమారు వందేళ్ల పాటు ఒక బృహత్తర యజ్ఞాన్ని నిర్వహించాడు. దిగ్విజయంగా ముగిసిన యజ్ఞం వల్ల దేవతలందరూ సంతోషించారు. కాని నిత్యం హోమాగ్నిలో ఆజ్యం పోయడం వల్ల అగ్నిదేవుడికి అజీర్తి చేసింది. ఆహారం పట్ల విముఖత ఏర్పడింది. అంతట అగ్నిదేవుడు బాధా నివారణకు బ్రహ్మ దేవుడిని అర్చించి తరుణోపాయం కోరగా .. " ఖాండవవనంలో అనే రకాల దివ్య ఓషధులు ఉన్నాయి, అలాగే దేవతలకు శత్రువులైన కొన్ని జంతువులున్నాయి. వనాన్ని దహించి నీ బాధను పోగొట్టుకోవచ్చు. ఓషధుల మూలంగా నీ ఆరోగ్యం బాగుపడుతుంది. శత్రుసంహారమూ జరుగుతుంది" అని సలహా ఇచ్చాడు సృష్టికర్త..

నివారణోపాయాన్ని తెలుసుకున్న అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని దహించడానికి ఉపక్రమించాడు. కాని వనంలో ఇంద్రుని స్నేహితుడైన తక్షకుడు తన భార్యా పిల్లల్లతో ఉంటున్నాడు. తన స్నేహితుడిని రక్షించడానికి ఇంద్రుడు పూనుకున్నాడు. అగ్నిదేవుడు వనాన్ని దహించడం మొదలుపెట్టగానే ఇంద్రుడు కుండపోతగా వర్షం కురిపించాడు. వనాన్ని ఎలాగైనా దహించి తన ఆరోగ్య సమస్యను తీర్చుకోవాలన్న కృతనిశ్చయంతో అగ్నిదేవుడు వరుసగా ఏడురోజులు ప్రయత్నించినా విఫలుడయ్యాడు. మళ్లీ బ్రహ్మ దగ్గరకు వెళ్లి మొరపెట్టుకోగా "నరనారాయణులు భూమిపై కృష్ణార్జునులుగా అవతరించినప్పుడు నీ కోరిక నెరవేరుతుంది. వేచి ఉండుము" అని ఉపాయం చేప్తాడు బ్రహ్మదేవుడు.

కృష్ణార్జునులు ఇంద్రప్రస్తంలో ఉన్నప్పుడు యమునాతీరాన విహారానికి చేస్తుండగా అగ్నిదేవుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వారి వద్దకు వెళ్లి తన వ్యాధి గురించి చెప్పి సహాయం అర్ధించాడు. తర్వాత తన నిజరూపంలో ఖాండవ వనాన్ని దహనం చేయాలనే కోరికను వెలిబుచ్చాడు. కానీ సమయంలో కృష్ణార్జునుల వద్ద ఎటువంటి ఆయుధాలు లేవు. అది గమనించి అగ్నిదేవుడు వరుణ దేవుడిని ప్రార్ధించగా, అతను ప్రత్యక్షమై అర్జునుడికి చంద్రధనుస్సు (గాండీవం) , దానితో పాటు అక్షయ తూణీరం ఇచ్చాడు. తూణీరంలో ఎన్ని బాణాలు తీసివేస్తున్నా అది ఖాళీ కాదు. ఎప్పుడూ శరసమృద్ధమై ఉంటుంది. దానికి తోడూ కపిరాజు చిత్రంతో ఉన్న ధ్వజాన్ని అమర్చి, బలిష్టమైన నాలుగు అశ్వాలు పూన్చి నాలుగింటికీ కళ్ళేలుగా నాలుగు బంగారు గొలుసులు ఉన్న దివ్య రధాన్ని ఇచ్చాడు.

కృష్ణార్జునులు ఖాండవవన సరిహద్దుల్లో నిలబడి కాపలా కాస్తూ వనాన్ని దహించమని అగ్నికి చెప్పారు. అగ్ని జ్వాలలకు తట్టుకోలేక అడవిలో తపస్సు చేసుకుంటున్న మహర్షులు ఎటూ పోలేక రక్షించమని దేవేంద్రుణ్ణి వేడుకున్నారు. అతని ప్రభావంతో ఉరుములు , మెరుపులతో వర్షం మొదలైంది. వెంటనే అర్జునుడు ఆకాశంలో అమ్ములతో ఛత్రం ఏర్పరిచి వాన జల్లు అడవిలో పడకుండా అడ్డుకున్నాడు. సమయానికి తక్షకుడు కురుక్షేత్రం వెళ్ళాడు. అతని కొడుకు అశ్వసేనుడు మంటల్లో చిక్కుకుని గిలగిల్లాడసాగాడు. కొడుకును కాపాడడానికి అతని తల్లి అతన్ని మింగి దూరంగా విసిరేయాలనుకుంది. అది గమనించిన అర్జునుడు అశ్వసేనుడు తల నరకబోయాడు. వెంటనే ఇంద్రుడు గాలి దుమ్ము రేపాడు. కళ్ళలోకి ధూళి పోవడంతో అర్జునుడి గురి తప్పింది. అశ్వసేనుడు రక్షింపబడ్డాడు. అశ్వసేనుడు తలదాచుకునేందుకు ఎక్కడా చోటు దొరకరాదని అగ్ని, కృష్ణార్జునులు శపించారు.

బాణాల గొడుగు చాటున అగ్ని ఖాండవవనాన్ని దహిస్తున్నాడు. అతిప్రయాసతో తప్పించుకుని బయటకు వచ్చిన పాములను, డేగలను అర్జునుడు వధించాడు. మరోపక్క కృష్ణుడు అసురులను మట్టికరిపించాడు. దేవతలందరూ ఇంద్రుడికి యుద్ధంలో సహాయపడినా ఇంద్రుడు ఓడిపోయాడు. కృష్ణార్జునులు విజయం సాధించారు. ఖాండవవనాన్ని సమూలంగా దహించిన అగ్నిదేవుడు తిరిగి ఉజ్వలంగా ప్రకాశించాడు.

Labels:

posted by జ్యోతి, 7:24 PM | link | 4 comments |