<body><script type="text/javascript"> function setAttributeOnload(object, attribute, val) { if(window.addEventListener) { window.addEventListener('load', function(){ object[attribute] = val; }, false); } else { window.attachEvent('onload', function(){ object[attribute] = val; }); } } </script> <div id="navbar-iframe-container"></div> <script type="text/javascript" src="https://apis.google.com/js/platform.js"></script> <script type="text/javascript"> gapi.load("gapi.iframes:gapi.iframes.style.bubble", function() { if (gapi.iframes && gapi.iframes.getContext) { gapi.iframes.getContext().openChild({ url: 'https://draft.blogger.com/navbar.g?targetBlogID\x3d1254698467234035774\x26blogName\x3d%E0%B0%9C%E0%B0%97%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%BE%E0%B0%9F%E0%B0%95%E0%B0%82\x26publishMode\x3dPUBLISH_MODE_BLOGSPOT\x26navbarType\x3dTAN\x26layoutType\x3dCLASSIC\x26searchRoot\x3dhttps://jagannaatakam.blogspot.com/search\x26blogLocale\x3den_US\x26v\x3d2\x26homepageUrl\x3dhttp://jagannaatakam.blogspot.com/\x26vt\x3d-5619112905543282348', where: document.getElementById("navbar-iframe-container"), id: "navbar-iframe" }); } }); </script>

జగన్నాటకం

ఈ అద్భుత జగన్నాటకం లో లక్షల పాత్రలు...అందులో కొన్ని ఇక్కడ మిమ్మల్ని పలకరించడానికి...

గంగావతరణం-1

Thursday, August 23, 2007

ఒకసారి నారదుడు మహతి మీటుకుంటూ ఆకాశమార్గాన వెళ్తూ ఉండగా ఒకచోట కొంతమంది స్త్రీపురుషులు శ్రావ్యంగా రాగాలాపన చేస్తూ ఉండడం అతడి కంటపడింది. ఆ పాటలు వింటూ దగ్గరికి వెళ్ళి చూడగా, వాళ్లలో ప్రతి ఒక్కరికీ ఏదో ఒక శారీరకలోపం ఉన్నట్లు కనబడింది. ఒకరికి కన్ను లొట్టబోయి ఉంటే ఇంకొకరికి చెయ్యో కాలో లోపించి ఉండడం, కొందరికి ముక్కు లేకుండా ఉండడం, ఇలా. వాటికితోడు అందరికీ వంటిమీద గాయాలున్నాయి. అది గమనించిన నారదుడు ఆశ్చర్యంగా, ""మీరెవరు? మీకీ గాయాలేమిటి?" అని అడగ్గా, వాళ్ళు "మేం రాగ-రాగిణులం. (అంటే సంగీతంలోని రాగాల అధిదేవతలు. రాగాలు స్థూలంగా రెండు రకాలు: జనక రాగాలు, జన్య రాగాలు. జనకరాగాలు మళ్ళీ స్త్రీరాగాలు, పురుషరాగాలు అని రెండురకాలు. ఆ స్త్రీరాగాలనే రాగిణులని అంటారు.) భూలోకంలో గాయనీగాయకులు ఒక్కో అపస్వరం పాడినప్పుడల్లా ఆ అపస్వరం తీవ్రతను బట్టి మాకిలా గాయాలవుతూ ఉంటాయి. మా అవకరాలన్నీ వాటి ఫలితమే." అని వివరించారు.

స్వయంగా సంగీతజ్ఞుడైన నారదుడు అది విని ఎంతో బాధపడి, "ఐతే దీనికి విరుగుడు లేదా?" అని అడిగాడు. దానికి వాళ్ళు, "పరిపూర్ణ గాయకుడు పాడినప్పుడు ఆ గానం వింటే మాకు స్వస్థత చేకూరుతుంది" అని చెప్పారు. "మరి ఆ పరిపూర్ణ గాయకుడెవరు?" అని నారదుడడగ్గా, పరమశివుడొక్కడే పరిపూర్ణ గాయకుడని వారు తెలిపారు. "మరి ఆయనను పాడమని ప్రార్థించి మీ బాధ పోగొట్టుకోవచ్చు గదా?" అని అడిగితే వాళ్ళు, పరిపూర్ణ శ్రోత ఒక్కరైనా ఉంటేనే పరిపూర్ణ గాయకుడు పాడుతాడని తెలిపారు.

"మరి ఆ పరిపూర్ణ శ్రోతలెవరు?"

"బ్రహ్మ, విష్ణువు వీళ్ళిద్దరే పరిపూర్ణ శ్రోతలు."

"ఐతే నేను వాళ్ళు ముగ్గుర్నీ ప్రార్థించి, మీ కోసం పరమశివుడు పాడేలా చేస్తాను" అని నారదుడు అక్కణ్ణించీ సత్యలోకానికెళ్ళి బ్రహ్మను, వైకుంఠానికెళ్ళి విష్ణువును, కైలాసానికెళ్ళి శివుణ్ణి కలిసి వారికి విషయం వివరించగా, బ్రహ్మ, విష్ణువులు ఇద్దరూ పరమశివుడి గానాన్ని వినడానికి మహదానందంగా అంగీకరించారు. వాళ్ళు వినడానికి సిద్ధంగా ఉన్నారని తెలియగానే శివుడు పాట పాడడానికి సిద్ధమయ్యాడు. కైలాసంలోనే వేదిక సిద్ధం చేశారు. బ్రహ్మ, విష్ణువు, నారదుడు, రాగ-రాగిణులు వింటూ ఉండగా, శివుడు గానం ప్రారంభించాడు. విష్ణువు ఆ గానాన్ని మైమరచి వింటూ ఉండగా, ఆయన శరీరంలోని ఒకపొర కరిగి నీరై కదిలింది. అలా మెల్లగా కదిలి కదిలి విష్ణుపాదం నుంచి జారి కింద పడబోతున్న ఆ నీటిబొట్టును బ్రహ్మ తన కమండలంలో పట్టుకున్నాడు. ఆ విధంగా విష్ణువు పాదం నుంచి వెలువడి బ్రహ్మ కమండలంలోకి చేరిన ఆ నీటిబొట్టే గంగ.

ఆ గంగ అక్కడి నుంచి బయటపడి భూమ్మీదకు రావడానికి భగీరథప్రయత్నం అవసరమైంది. ఆ కథ ఇంకోసారెప్పుడైనా...

(1. పరమశివుడి గానాన్ని మైమరచి విన్న విష్ణువును పరిపూర్ణశ్రోత అనడం న్యాయమే. కానీ ఒకవైపు శివుడు పాడుతూ ఉంటే ఇంకోవైపు విష్ణువు శరీరంలో కలిగిన అతిచిన్న మార్పును సైతం గమనించగలిగిన బ్రహ్మ పరిపూర్ణశ్రోత ఎలా అయ్యాడబ్బా? ఇది రాస్తున్నప్పుడు నాకొచ్చిన అనుమానమిది. బ్రహ్మకున్న నాలుగు తలల్లో సంగీతం పట్ల అంతగా ఆసక్తిలేని తల కూడా ఒకటుందనుకోవాలా?

2. కలహం జోలికి పోకుండా కలహాశనుడు పూనుకుని నడిపించిన కథ ఇది.)
posted by త్రివిక్రమ్ Trivikram, 6:19 PM | link | 2 comments |

కాకి - హంస

Thursday, August 9, 2007

పూర్వం ఒకానోక రాజ్యాన్ని ధర్మవర్తి అనే రాజు పాలించేవాడు. ఆ రాజ్యంలో ఒక వర్తకుండేవాడు. భాగ్యవంతుడు.మంచివాడు. ఒక రోజు అతనొక కాకిని చేరదీసి రోజు దానికి ఎంగిలి మెతుకులు వేసి పెంచారు.అది బాగా బలిసి కొవ్వెక్కి ఏ పక్షులూ తనకు సరిరావని విర్రవీగుతూ ఉండేది.

ఒకనాడు సముద్ర తీరంలో కొన్ని రాజహంసలు విహరిస్తున్నాయి. వాటిని కాకికి చూపించి "అన్ని పక్షుల కంటే బలమైన దానివి నువ్వు. ఆ హంసల కంటే ఎత్తుగా ఎగరగలవా? "అన్నారు వర్తకుని పిల్లలు. ఎంగిళ్ళు తిని బలిసిన ఆ కాకి తారతమ్య జ్ఞానం లేక హంసల దగ్గరకు వెళ్ళి తనతో పందానికి రమ్మంది. హంసలన్నీ పకపక నవ్వాయి."మానస సరోవరంలో ఉంటాం. మహా బలవంతులం. హంసలతో సరితూగగలిగే కాకులు ఉన్నట్టు ఎప్పుడైనా విన్నావా . చూసావా??" అన్నాయి. "నూటొక్క గతులలో పరుగెత్తడం నాకు చేతనవును. ఒక్కొక్క రకం గమనంలో నూరు యోజనలు వెళతాను. మీరెలా కావాలంటే అలా ఎగురుదాం. కావాలంటే పందెం కాద్దాం " అంది కాకి. "ఆ గతులు, గమనాలు మాకు తెలీదు.మామూలుగా సముద్రం మీద ఎగురుదాం. మేమంతా వద్దు కాని మాలో ఒక హంస నీతో పోటీకి వస్తుంది" అన్నాయి మరాళాలు.

ఒక హంస, కాకి రెండూ సముద్రం మీదుగా ఎగరటం మొదలుపెట్టాయి. హంస నెమ్మదిగా వెళుతుంటే కాకి మాత్రం విన్యాసాలు చేయసాగింది.హంసను దాటిపోయి వెనక్కి తిరిగి హంసను వెక్కిరించడం,ముక్కు మీద ముక్కు పెట్టడం, జుట్టు రేపుకుని, ఈకలు ఈకలతో రాయడం, నవ్వడం మొదలైన పనులు చేసింది. హంస అవన్ని పట్టించుకోక ఊరకుంది. కాసేపటికి కాకి అలిసిపోఉయింది. హంస పొడుగ్గా ఎగిసి పడమరకు పరుగెత్తింది. కాకి ఇంక ఎంతమాత్రం ఎగరలేక రొప్పుతూ బిక్కమోహం వేసింది. హంసను మించలేకపోగా ప్రాణభీతితో వ్యాకులపడింది. "అయ్యో! నా అవయవాలన్నీ వికలమైపోయాయి కాసేపు ఆగుదామంటే పర్వతాలు, చెట్లు కూడా లేవు. ఈ సముద్రంలో పడితే మరణమే గతి" అనుకుంటూ భయపడుతూ కళ్ళు తేలేసింది.


అది చూసి "నీకు చాలా గమనాలు వచ్చన్నావే. గొప్ప గొప్ప విన్యాసాలు చేసావు. ఒక్కటీ చూపవేమి వాయసరాజమా?" అంది హంస. కాకి సిగ్గుపడింది. అప్పటికే అది సముద్రంలోకి దిగబడి పోవడానికి సిద్ధంగా ఉంది. "ఎంగిళ్ళు తిని కొవ్వెక్కి గర్వంతో కన్నూ మిన్నూ గానక నాకెదురెవరూ లేరనీ, ఎంతటి బలవంతులనయినా గెలవగలనని అనుకునేదాన్ని. నా సామర్ధ్యమేమిటో నాకిప్పుడు తెలిసింది. నాయందు దయ చూపి నను రక్షించు" అంటూ ఆర్తనాదం చేసింది కాకి. నీళ్ళలో మునిగిపోతూ "కావుమని" దీనంగా అరుస్తున్న కాకిని చూసి జాలిపడిన హంస తన కాళ్ళతో దాని శరీరాన్ని పైకి లాగింది. చావు తప్పించింది."ఇంకెప్పుడు గొప్పలు పోకు" అని మందలించి దానిని తీరానికి విసిరి ఎగిరిపోయింది రాజహంస.

కాకి లెంపలేసుకుంది.


"అలాగే - వైశ్యపుత్రుల ఎంగిళ్ళు తిన్న కాకిలాగా నువ్వు కూడా కౌరవుల ఎంగిళ్ళు తిని అర్జునుణ్ణి ధిక్కరిస్తున్నావు. దీనివల్ల చేటు కలుగుతుంది సుమా!! హెచ్చులకు పోకు" అని కర్ణుని రథసారథి పాండవుల మేనమామ శల్యుడు యుద్ధ రంగంలో అతడిని హెచ్చరించాడు.

Labels:

posted by జ్యోతి, 5:18 PM | link | 3 comments |